శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 32)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ముప్పది రెండవ సర్గ

లక్ష్మణుడు కోపంతో వచ్చి ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు అని తెలుసుకున్న సుగ్రీవునికి మత్తు పూర్తిగా దిగింది. ఆసనము మీది నుండి లేచాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు.

"అయ్యో! లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది. నేనేమీ ఆయనతో చెడుగా మాట్లాడలేదే! ఏమీ తప్పుగా ప్రవర్తించలేదే! మరి లక్ష్మణునికి కోపం ఎందుకు వచ్చినట్టు. నా శత్రువులు ఎవరో నామీద చెడుగా లక్ష్మణునికి చెప్పి ఉంటారు. మీరందరూ ఆలోచించి మనము లక్ష్మణునితో ఎలా మాట్లాడాలో నిర్ణయం చెయ్యండి. 

నాకు రాముడు అన్నా లక్ష్మణుడు అన్నా భయం లేదు. కానీ, అకారణంగా లక్ష్మణుడు ఎందుకు కోపించాడా అని సంభ్రమంగా ఉంది. రాముడు లాంటి మిత్రుడు దొరకడమే చాలాకష్టము. అటువంటి మిత్రుని వదులుకుంటానా! రాముడు నాకు చేసిన సాయము ఈ జన్మలో మరువలేనిది. నేను ఎంత చేసినా, రాముడు చేసిన సాయమునకు సాటి రాదు. కాని చిన్న చిన్న విషయములకు కూడా స్నేహమునకు విఘాతము కలుగుతుంది. అందుకే నేను రామునికి భయపడుతున్నాను." అని అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు నేర్పుగా అంటున్న మాటలు విన్న హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! నీకు రాముడు చేసిన ఉపకారమును నీవు మరచిపోలేదు అనడంలో ఆశ్చర్యం ఏమీలేదు. నీకోసమే కదా రాముడు వాలిని చంపాడు. రాముడు ఎప్పటికీ నీకు మిత్రుడే. మరి అటువంటి రాముడు కోపించి లక్ష్మణుని పంపాడు. నీవు సుఖలాలసతతో మునిగి తేలుతూ కాలము ఎలా గడిచిపోతున్నదీ తెలుసుకోలేకున్నావు. నీవు అనుకొన్న వానాకాలము పోయి శరత్కాలము ప్రవేశించినది. రామునితో చేసుకున్న ఒప్పందము మేరకు మనము సీతను వెదకుటకు సమయము ఆసన్నమైనది అని నీవు గుర్తించడం లేదు. నీవు రామునితో చేసుకున్న ఒప్పందము మరిచిపోయినావనే, నీకు గుర్తుచేయడానికి రాముని దూతగా లక్ష్మణుడు వచ్చాడు అన్నవిషయం తెలుస్తూనే ఉంది.

నీవు నీ భార్యతో సుఖంగా ఉన్నావు. రాముడు తన భార్యను పోగొట్టుకొని కష్టాలలో ఉన్నాడు. అది గ్రహించు. కాబట్టి రాముడు ఏమన్నా నీవు సహించాలి. సీతను వెదకడంలో నీవు ఆలస్యం చేసి తప్పుచేసావు కాబట్టి, నీవు లక్ష్మణుని వద్దకు పోయి అతని కోపం ఉపశమించచేయడం తప్ప మరొక మార్గం లేదు. మంత్రులు అయిన వాళ్లు రాజుకు హితము చెప్పవలెను. అందుచేతనే. మంత్రులైన మేము, నీతో భయం విడిచి, హితమును చెప్పుచున్నాము. రాముడికే కోపం వస్తే ఏం జరుగుతుందో మా కన్నా నీకే బాగా తెలుసు. రాముడు నీకు చేసిన ఉపకారమును మనసులో ఉంచుకొని, కృతజ్ఞతా భావంతో రాముని ప్రసన్నం చేసుకో. రామునికి కోపం తెప్పించడం కిష్కింధకు మంచిది కాదు.”అని హితోక్తులు పలికాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)