శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 31)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పది ఒకటవ సర్గ
రాముడు మాట్లాడుతున్నంత సేపూ లక్ష్మణుడు తన కోపాన్ని అణుచు కుంటున్నాడు. అన్నమాట తప్పి నందుకు లక్ష్మణునికి సుగ్రీవుని మీద కోపం ముంచుకొచ్చింది.“అన్నయ్యా! వానరుడైన ఈ సుగ్రీవుడు మంచి వాడిలా ప్రవర్తించడం లేదు. తాను చేసే పనుల వలన కలిగే ఫలితములను తెలుసుకోడం లేదు. మాట తప్పినందుకు సుగ్రీవునికి కాలం మూడింది. రామా! నీవు చేసిన ఉపకారము వలన వచ్చిన రాజ్యమును, భార్యను అనుభవిస్తున్నాడే కానీ, అనుకున్న ఒప్పందము ప్రకారము ప్రత్యుపకారము చేయవలెననే ఆలోచన వానికి ఉన్నట్టు లేదు. వీడిని తన అన్న వాలి వద్దకు పంపడమే ఉత్తమము. ఇటువంటి వాడు రాజ్యము చేయుటకు అనర్హుడు. సుగ్రీవుని తలచుకుంటేనే నాకు కోపం మిన్నుముట్టుతూ ఉంది. వాడిని చంపకుండా వదలను. అంగదునికి రాజ్యాభిషేకము చేద్దాము. అంగదుడే సీతను అన్వేషించడంలో మనకు సాయపడగలడు." అంటూ లక్ష్మణుడు ధనుస్సు తీసుకొని లేచాడు.
రాముడు లక్ష్మణుని అనునయించి ఇలా అన్నాడు. "లక్ష్మణా! సుగ్రీవుడు పాపం చేసాడని మనం కూడా పాపం చేస్తామా! సుగ్రీవుని చంపి పాపం ఎందుకు మూటకట్టుకుంటావు? నీలోని వివేకంతో ఆలోచించు. కోపాన్ని వదిలిపెట్టు. మనకు సుగ్రీవునితో స్నేహపూర్వక ఒప్పందం ఉంది. దానిని అనుసరించి ప్రవర్తించు. సుగ్రీవుడు తాను అన్న మాట తప్పాడు. మనము కూడా అతనితో సానుకూలంగా మాట్లాడి, కార్యము చక్కపరచుకోవాలి. కాబట్టి ముందు సుగ్రీవునితో సౌమ్యంగా మాట్లాడు. వినకపోతే అప్పుడు తగిన విధంగా దండించవచ్చును." అని అన్నాడు రాముడు.
అన్నగారి మాటలను శిరస్సున దాల్చి, లక్ష్మణుడు కిష్కింధకు వెళ్లాడు. తన ధనుస్సును చేతబూని యమధర్మరాజు మాదిరి నిలబడ్డాడు. తాను సుగ్రీవునితో ఏమి మాట్లాడాలి, దానికి సుగ్రీవుని ఇచ్చే సమాధానాన్ని బట్టి తిరిగి తాను ఏమి మాట్లాడాలి అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాడు లక్ష్మణుడు. కిష్కింధ వెలుపల సంచరించు వానరులను చూచాడు లక్ష్మణుడు. కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుని చూచి ఆ వానరులు చేతి కందిన చెట్ల కొమ్మలను, రాళ్లను పట్టుకొని నిలుచున్నారు. ఆ వానరులను చూచి లక్ష్మణుడు కోపంతో హుంకరించాడు. వానరులందరూ భయపడి తలొకదిక్కుకు పారిపోయారు.
కొంత మంది వానరులు, సుగ్రీవుని వద్దకు పరుగు పరుగునపోయి లక్ష్మణుడు వచ్చి కోపంతో ద్వారము వద్దకు నిలబడి ఉన్నాడు అని చెప్పారు. కాని తారతో కూడి కామ సుఖములు అనుభవిస్తున్న సుగ్రీవుడు, వారి మాటలు వినిపించేకోలేదు. వానరులందరూ బయటకు వచ్చారు. వారు తమ చేతులలో చెట్ల కొమ్మలను, రాళ్లను, ఆయుధములను పట్టుకొని లక్ష్మణునికి కనపడునట్టుగా నిలబడ్డారు. తాను వచ్చిన విషయము తెలిసికూడా సుగ్రీవుడు తన దగ్గరకు రానందుకు లక్ష్మణుని కోపం తారస్థాయికి చేరుకుంది. కోపంతో మండిపడుతున్నాడు. ఈ విషయం అంగదునికి తెలిసింది. లక్ష్మణుని కోపం చూచి అంగదుడు భయపడ్డాడు.
లక్ష్మణుడు అంగదుని పిలిచి “కుమారా! నీవు వెళ్లి నీ పినతండ్రి సుగ్రీవునికి నేను వచ్చానని తెలియజెయ్యి " అని అన్నాడు.
వెంటనే అంగదుడు సుగ్రీవుని అంతఃపురమునకు వెళ్లాడు. సుగ్రీవుని పాదములకు, రుమ పాదములకు నమస్కరించాడు. లక్ష్మణుని రాక గురించి సుగ్రీవునికి తెలియజేసాడు. కాని సుగ్రీవుడు, మద్యం మత్తులో ఉన్నాడు. అందుకని అంగదుడు ఏం చెప్పాడో అతనికి వినపడలేదు. అంగదుని వెంట ఉన్న మంత్రులు పక్షుడు, ప్రభావుడు కూడా సుగ్రీవునికి లక్ష్మణుని రాక గురించి తెలియజేయడానికి ప్రయత్నించారు.
“ఓ రాజా! సుగ్రీవా! రామ లక్ష్మణుల అనుగ్రహంతో నీకు రాజ్యము లభించింది. వారునీకు మిత్రులు. లక్ష్మణుడు వచ్చి ద్వారము వద్ద ధనుర్ధారియై నిలబడి ఉన్నాడు. అతనిని చూచి వానరులందరూ భయంతో వణికిపోతున్నారు. రాముడు నీతో చెప్పమన్న మాటలు చెప్పుటకు లక్ష్మణుడు నీ వద్దకు వచ్చాడు. తాను వచ్చినట్టు నీతో చెప్పమని లక్ష్మణుడు ఈ అంగదుని నీ వద్దకు పంపాడు. అతని వెంట మేము కూడా వచ్చాము. లక్ష్మణుడు అమితమైన కోపంతో ద్వారం వద్ద నీకొరకు వేచిఉన్నాడు.
కాబట్టి ఓ రాజా! నీవు వెంటనే వెళ్లి, లక్ష్మణుని కలుసుకొని, అతనికి నమస్కరించి, అతని కోపము తగ్గించు. నీవు రామునితో చేసుకున్న ఒప్పందము ప్రకారము చేస్తానని లక్ష్మణునికి వినయంగా
చెప్పు. రాముడు ఏమి చెప్పి పంపాడో ఆవిధంగా చెయ్యి. అదే ప్రస్తుత కర్తవ్యము." అని మంత్రులు సుగ్రీవునికి హితోపదేశము చేసారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment