శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 30)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పదవ సర్గ
వర్షాకాలము గడిచి పోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మరచినాడని, తన భార్య సీతను తలచుకొని దుఃఖిస్తున్నాడు. ఈ శరత్కాలములో పండువెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారము భార్యావియోగము అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు రాముడు. ఒకవేళ బతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు.మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూచాడు లక్ష్మణుడు. మరలా రాముని ఉత్తేజపరచి కార్యోన్ముఖుడిని చేయదలిచాడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఏమిటీ వెర్రి! ఈ ప్రకారము కామానికి వశుడు కావడం వలన ప్రయోజనము ఏముంది! దీని వలన మానసిక స్థైర్యము నశించడం తప్ప వేరే ఏమీ జరగదు. ఏ కార్యమూ సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి, మనసును నిర్మలం చేసుకొని, కాగల కార్యము నందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యము నైననూ సిద్ధింప చేసుకొన వచ్చును కదా! మనం ధైర్యంగా ఉంటే దైవము కూడా మనకు తోడుపడుతుంది. ముందు సుగ్రీవుడు మనకు ఎంత వరకూ సాయ పడగలడో ఆలోచించాలి.” అని లక్ష్మణుడు రామునికి కర్తవ్యమును బోధించాడు.
రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.
"లక్ష్మణా! అప్పుడప్పుడు నా మనసు అలా దైన్యము చెందుతూ ఉంటుంది. నీ మాటలతో మరలా ధైర్యము తెచ్చుకుంటూ ఉంటాను. మనము తల పెట్టిన కార్యమును నెరవేరేట్టు చూడాలి.
లక్ష్మణా! వర్షాకాలము పూర్తి అయినది. వర్షములు ఆగిపోయినవి. శరత్కాలము ప్రవేశించినది. ఆకాశము నిర్మలంగా ఉంది. రాత్రుళ్లు చంద్రుడు తన కాంతితో ఈ జగత్తును అంతా తేజోమయం చేస్తున్నాడు. నేలంతా తడి ఆరిపోయి నడవడానికి అనుకూలంగా ఉంది. రాజులు శత్రురాజుల మీద దండయాత్రలు చేయుటకు తగు సమయము ఆసన్నమయింది. కానీ సుగ్రీవుడు ఎందుకో ఇంకా నా వద్దకురాలేదు. కనీసము సీతను వెదకడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు.
నేనేమో ఇక్కడ సీతా వియోగ దు:ఖంతో అలమటిస్తుంటే, అక్కడ సుగ్రీవుడు కామభోగాలలో మునిగి తేలుతున్నాడు. అటు రాజ్యం పోగొట్టుకొని, ఇటు భార్యను పోగొట్టుకొని బాధ పడుతున్న నా మీద సుగ్రీవునికి దయ కలగడం లేదు. సుగ్రీవుడు తన పని అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు.
“ఈ రాముడు తండ్రి చేత రాజ్యము నుండి వెళ్ల గొట్టబడిన అనాధ. పైగా రావణుడు అతని భార్యను అపహరించాడు. నా శరణు వేడాడు. ప్రస్తుతము నేనే రామునికి దిక్కు" అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సుగ్రీవుడు, తన పని పూర్తి కాగానే, నాతో చేసుకొన్న ఒడంబడికను మరచి పోయినట్టున్నాడు.
లక్ష్మణా! నీవు కిష్కింధకు పోయి, సుగ్రీవుని కలిసి నా మాటగా చెప్పు. మిత్రుని వలన తన పనిపూర్తి కాగానే, తాను మిత్రునికి ఇచ్చిన మాట మరచిన వాడు అధముడు. అది పుణ్యమైనను, పాపమైనను, మిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేవాడు ఉత్తముడు. తనకు సంబంధించిన పనులు పూర్తి అయిన తరువాత, ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరైతే సాయం చెయ్యరో అటువంటి వారి మాంసమును కుక్కలు కూడా ముట్టవు. ఇది ధర్మము. సుగ్రీవుడు మరలా నా ధనుష్టంకారమును వినదలచు కొన్నాడో ఏమో అడిగి తెలుసుకో. ఈ సారి నేను బాణం ఎక్కుబెడితో అది సుగ్రీవుని మీదనే అవుతుంది. సుగ్రీవుడు లేకపోయినా నీ సాయంతో నేను కార్యం సాధించగలను. కానీ, సుగ్రీవుడు తన పని పూర్తి అయిన తరువాత, మనలను మరచిపోయినట్టున్నాడు. అది గుర్తు చెయ్యి. సుగ్రీవుడు మనలను వర్షాకాలము వరకూ ఆగమన్నాడు. వర్షాకాలము అయిపోయినా, సుగ్రీవుడు ఇంకా మద్యపాన మత్తులో, కామభోగములలో మునిగి తేలుతున్నాడు. ఇంకా మత్తు వదిలినట్టు లేదు. మనలను పూర్తిగా మరచినట్టున్నాడు.
లక్ష్మణా! నీవు పోయి సుగ్రీవుని కలిసి, నాకు కోపం వస్తే జరిగే పరిణామాలను అతనికి తెలియజెయ్యి.
“సుగ్రీవా! వాలి వెళ్లిన మార్గము ఇంకా మూసివేయబడ లేదు. నీ కోసం ఇంకా తెరిచి ఉంచాను. వాలి వెళ్లిన మార్గంలో వెళ్లడానికిప్రయత్నించకు.
ఓ సుగ్రీవా! నేను వాలిని ఒక్కబాణంతోనే చంపాను. కానీ మాట తప్పిన నిన్ను మాత్రం బంధు మిత్రులతో సహా చంపుతాను.
ఓ సుగ్రీవా! అశాశ్వతములైన కామసుఖములను విడిచి పెట్టి, శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించు. పూర్వము నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అంతేకాని, నా బాణములకు ఎరగా మారి, పరలోకంలో ఉన్నవాలిని కలవడానికి ప్రయత్నించకు.”
అని నా మాటగా చెప్పు. ఇంకా నీకు తోచినవి, మనకు హితము చేకూర్చే మాటలు చెప్పు. ఇంక ఆలస్యముచేయకు.” అని రాముడు లక్ష్మణునితో అన్నాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment