శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 29)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది తొమ్మిదవ సర్గ
వర్షాకాలము పూర్తి అయింది. శరదృతువు ప్రవేశించింది. ఆకాశం నిర్మలమయింది. కాని సుగ్రీవుడు ఇంకా కామభోగములలో మునిగి తేలుతున్నాడు. అంత:పురము విడిచి రావడం లేదు. స్త్రీలసాహచర్యంలోనే గడుపుతున్నాడు. తన భార్య రుమతోనూ, తన అన్న భార్య తార సాహచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు.
(స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్, విహరన్తమహోరాత్రం అంటే తన భార్యను, తానుకోరిన తారను అహోరాత్రాలు విహరిస్తున్నాడు... అని ఉంది. అలాగే ముప్పది ఒకటవ సర్గలో కూడా ఈ క్రింది శ్లోకము ఉంది. "తారయా సహిత: కామాసక్త:" అంటే తారతో కలిసి కామాసక్తుడై ఉన్నవాడు అనిఉంది. అంటే వాలి చని పోయిన తరువాత వాలి భార్య తార సుగ్రీవుని వశం అయిందని అర్ధం అవుతూ ఉంది. మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా! అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే వాలి, సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు. కానీ సుగ్రీవుడు, వాలి చనిపోయిన తరువాత, వాలి భార్య తారను అనుభవించాడు అని అర్థం చెప్పుకోవాలి.)
సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వడం లేదు. కార్యభారము అంతా మంత్రులకు అప్పచెప్పాడు. ఇంక ఎవరి వల్లా తనకు ఆపదలేదు అని నిర్భయంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు.
సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు. రాముడికి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తుచేయాలని అనుకున్నాడు. సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు.
సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు. రాముడికి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తుచేయాలని అనుకున్నాడు. సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు.
" ఓ రాజా! నీవు రాముని మూలంగా ఈ రాజ్యమును, కీర్తిని సంపాదించుకున్నావు. ఇంక నీవు, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. నీవు రాముని కార్యము నిర్వర్తించాలి. మిత్రుల విషయంలో బాగా ప్రవర్తించే వాళ్లు కీర్తిమంతులు అవుతారు. ఒక రాజుకు తన కోశాగారము, సైన్యము, తన మిత్రులు, తన ప్రభుత్వము ఈ నాలుగు అత్యంత ముఖ్యమైనవి. అందుకని, నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాట నెరవేర్చు. మిత్రునికి ఇచ్చిన మాట నెరవేర్చని వాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటాడు.
రాజా! ఏకార్యము చేసినా సకాలంలో చెయ్యకపోతే, తరువాత ఎంత గొప్పగా చేసినా దానికి ఫలితం ఉండదు. పైగా ఆ పనిచెయ్యనట్టే అవుతుంది. ఓ రాజా! రాముని కార్యం చెయ్యడంలో ఇప్పటికే కాలం మించిపోయింది. ఇప్పటికైనా రామకార్యములో నిమగ్నమవ్వు. వానలు తగ్గిపోయాయి.
సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది. వానాకాలము ఆగిపోయింది, సమయం మించి పోయింది అని రామునికి తెలిసినా, నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు. రాముడు నీకు మేలు చేసాడు. తిరిగి రాముడికి మేలు చెయ్యడానికి ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తుచేసే వరకూ ఆగకు. అప్పటిదాకా ఆగితే, నీవు కావాలని ఆలస్యము చేసినట్టు అవుతుంది.
సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది. వానాకాలము ఆగిపోయింది, సమయం మించి పోయింది అని రామునికి తెలిసినా, నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీకోసం ఎదురుచూస్తున్నాడు. రాముడు నీకు మేలు చేసాడు. తిరిగి రాముడికి మేలు చెయ్యడానికి ఆలస్యం చెయ్యడం మంచిదికాదు. రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తుచేసే వరకూ ఆగకు. అప్పటిదాకా ఆగితే, నీవు కావాలని ఆలస్యము చేసినట్టు అవుతుంది.
ఓ రాజా! నీకు ఏ సాయమూ చేయని వారికి కూడా నీవు సాయం చేస్తావు కదా! మరి నీకు ఇంత సాయం చేసిన రామునికి సాయం చెయ్యడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వానరులను
పిలిచి వారికి సీతాన్వేషణకు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? రాముడు తన బాణములతో దేవతలను, రాక్షసులను అంతమొందించ గల సామర్థ్యము కలవాడు. కానీ నీ సాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తావా లేదా అని వేచి ఉన్నాడు.
కాబట్టి ఓ వానర రాజా! నీకు ముందుగా ఉపకారము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయడానికి ఉద్యమించు. మేమందరమూ నీ ఆజ్ఞ కొరకు ఎదురుచూస్తున్నాము. నీ ఆజ్ఞ అయితే మేము భూమ్యాకాశములను గాలించి సీత జాడ తెలుసుకుంటాము. నీ అధీనములో ఒక కోటి కంటే ఎక్కువ సంఖ్యలో వానరులు ఉన్నారు. వారిని రామకార్యమునకు తగిన విధంగా నియోగించు. త్వరపడు.” అని హితబోధ చేసాడు హనుమంతుడు.
తనమంత్రి అయిన హనుమంతుని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు. వెంటనే నీలుని పిలిపించాడు. సీతాన్వేషణ కొరకు వానర సేనలను అన్నిదిక్కులనుండి కిష్కింధకు రప్పించమని ఆదేశాలు ఇచ్చాడు. సమస్త వానరసేనలను తన ముందు నిలుప మని ఆదేశాలు ఇచ్చాడు.
“పదిహేను దినములలో వానరులందరూ కిష్కింధ చేరు కోవాలి. ఆ గడువు మించితే మరణదండన విధించబడుతుంది." అని వానరులను ఆదేశించాడు. హనుమంతుని, అంగదుని కొంతమంది వానర ప్రముఖులను కలిసికొనమని ఆదేశించాడు. ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చిన సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లిపోయాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment