శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 28)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది ఎనిమిదవ సర్గ
వర్షాకాలము మొదలయింది. ఆకాశమంతా మేఘావృతము అయింది. వేసవి కాలము అంతా ఆకాశము సూర్య కిరణముల ద్వారా నీటిని తాగి, వర్షాకాలములో ఆ జలములను మరలా భూమి మీదికి వదులుతూ ఉంది. ఆకాశమునుండి కారుతున్న వర్షపు ధారలు సీత కళ్ల నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనపడుతున్నాయి రామునికి.మేఘాలు వర్షిస్తున్నాయి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నెమళ్లు నర్తిస్తున్నాయి. అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు, వర్షము పడగానే భూమిపైకి వచ్చి రణగొణ ధ్వనులు చేస్తున్నాయి. నదులన్నీ గట్లు తెంచుకొని ప్రవహిస్తూ తమ నాధుడైన సముద్రుని చేరుటకు ఉరకలు వేస్తున్నాయి.
ఇవన్నీ చూచి రాముడు ఇలా అనుకుంటున్నాడు.
“అయోధ్యలో కూడా సరయూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకొని ఆషాఢ మాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు. భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టు కొని దు:ఖిస్తున్నాను. సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో! ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్లి వెతకడం అసాధ్యం కదా! అందుకే సుగ్రీవుడు వర్షాకాలము అయిపోయిన తరువాత వస్తాడు. అప్పుడు సీతను వెదకడం సులభం అవుతుంది. సుగ్రీవుని కోసరం వేచి ఉండక తప్పదు" అని అనుకొన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment