శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 27)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది ఏడవ సర్గ
రాముడు, లక్ష్మణుడు ప్రస్రవణ పర్వతము చేరుకున్నారు. ఆ పర్వతము మీద పులులు, సింహములు, మొదలగు క్రూరజంతువులు నివాసముంటున్నాయి. అవే కాకుండా ఎన్నో రకములైన వానరములు, భల్లూకములు కూడా నివాసముంటున్నాయి. అనేకములైన పొదలు, లతలు, వృక్షములతో ఆ పర్వతము శోభిల్లుతూ ఉంది.ఆ పర్వతము మీద ఉన్న ఒక పెద్ద గుహను తమ నివాసంగా చేసుకున్నారు రామలక్ష్మణులు. "లక్ష్మణా! ఈ గుహ మనకు నివాస యోగ్యముగా ఉన్నది కదూ! వర్షాకాలము అంతా ఇక్కడే ఉందాము. ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సుఉంది. అందులో అందమైన పద్మములు వికసించి ఉన్నాయి. కొంచెం దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. అందులో మనము స్నానాదులు చేయవచ్చును. ఈ నదీ తీరంలో వందలాది పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఈ అందమైన ప్రదేశములో మనము సుఖంగా జీవించెదము. పైగా ఇక్కడి నుండి కిష్కింధా నగరము కనుచూపుమేరలోనే ఉంది. వానర రాజైన సుగ్రీవుడు తన రాజ్యమును, తన భార్యను తిరిగి పొంది, తన బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు.” అని అన్నాడు రాముడు.
కాని రాముని మనసులో తన భార్య తనకు దూరంగా ఉంది అనే బాధ మాత్రం తొలుస్తూనే ఉంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. అనుక్షణం సీత గుర్తుకు వస్తూనే ఉంది. రాముని బాధను చూచి
లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! నీవు వీరుడవు. వీరుడవైన నీవు ఇలా దు:ఖించడం తగదు. దు:ఖముతో అన్నిపనులు నాశనం అవుతాయి. నీవు భగవంతుడిని నమ్ముతావు. నీవు చేయవలసిన పనులను సక్రమంగా చేస్తావు. ఎల్లప్పుడూ ధర్మంగా ప్రవర్తిస్తావు. అలాంటి నీవు ఇలా దు:ఖపడుతూ ఉంటే, నీ భార్యను అపహరించిన దుర్మార్గుడైన రాక్షసుని ఎలా సంహరిస్తావు. కాబట్టి దు:ఖమును విడిచి పెట్టు. ధైర్యం తెచ్చుకో. అప్పుడు సరిగా ఆలోచించ గలుగుతావు. రాక్షస సంహారము చేయగలుగుతావు.
ఓ రామా! నీవు తలచుకుంటే ముల్లోకములను గడగడ లాడించగలవు. అటువంటప్పుడు ఈ రాక్షసుడు రావణుడు ఒక లెక్కా! ఈ వర్షాకాలము పోయి శరత్కాలము రాగానే వానర వీరులతో కలిసి రాక్షస సంహారము చేయగలవు. రామా! నేను నీకు నీతులు చెప్పడం లేదు. నీలో నివురు కప్పిన నిప్పులా ఉన్న పరాక్రమాన్ని ప్రజ్వరిల్ల జేస్తున్నాను.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలు విన్న రాముడు ఇలా అన్నాడు. "లక్ష్మణా! నీవు నాకు నీతులు చెప్పలేదు. ఒక మంచి మిత్రుని మాదిరి హితబోధ చేసావు. నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసావు. అన్ని అనర్ధములకు మూలమైన ఈ శోకమును తక్షణము విడిచిపెడుతున్నాను. ధైర్యము తెచ్చుకుంటున్నాను. శరత్కాలము కొరకు, సుగ్రీవుని రాక కొరకు ఎదురుచూస్తుంటాను.”అని అన్నాడు రాముడు. రాముని మాటలకు సంతోషించాడు లక్ష్మణుడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! ఈ నాలుగు నెలలు ఇట్టే గడిచిపోతాయి. సుగ్రీవుడు నీకు ఇచ్చిన మాట ప్రకారము సీతను వెదకడానికి వానరులను పంపుతాడు. శత్రు సంహారము జరుగుతుంది. అంత దాకా కోపమును అణిచి పెట్టి ఓపిక వహించు. ఈ నాలుగునెలలు మనము ఈ పర్వత గుహలో ఆనందంగా గడుపుదాము." అని అన్నాడు లక్ష్మణుడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment