శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 26)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ఇరువది ఆరవ సర్గ

వాలికి దహన సంస్కారములు చేసిన అనంతరము, సుగ్రీవుడు, మిగిలిన వానర ప్రముఖులు అందరూ కలిసి రాముని వద్దకు వెళ్లారు. వారందరి సమక్షములో హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు.

“ఓ ప్రభో! నీ అనుగ్రహము వలన సుగ్రీవునికి తిరిగి రాజ్యము లభించింది. నీ అనుజ్ఞ అయితే సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించి యథావిధిగా రాజ్యాభిషిక్తుడై, కిష్కింధను పాలిస్తాడు. నీకు తగిన కానుకలు సమర్పించుకొని నిన్ను పూజించవలెనని అనుకుంటున్నాడు. కాబట్టి మా అందరి కోరిక మేరకు నీవు కిష్కింధా నగరమునకు వచ్చి మా సత్కారములను అందుకని మమ్ములను ఆనందింపజేయమని ప్రార్ధించుచున్నాము." అని వినయంగా అన్నాడు హనుమంతుడు.

ఆ మాటలకు రాముడు ఇలా అన్నాడు. “హనుమా! నేను నా తండ్రి ఆజ్ఞమేరకు వనవాసము చేయుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు జనావాసములలోకి అడుగుపెట్టను. మీరందరూ కలిసి సుగ్రీవునికి పట్టాభిషేకము చేయండి." అని అన్నాడు రాముడు. తరువాత సుగ్రీవునితో ఇలా అన్నాడు. "మిత్రమా! సుగ్రీవా! వాలి కుమారుడు అంగదుని యువరాజుగా అభిషేకించు. నీ అన్నగారి కుమారుడు అంగదుడు యువరాజుగా అభిషేకించడానికి తగినవాడు. ఇప్పుడు వర్షకాలము ఆరంభమయినది. ఈ నాలుగు నెలలు సీతాన్వేషణకు తగిన సమయము కాదు. కాబట్టి ఈ నాలుగు నెలలు నీవు కిష్కింధకుపోయి రాజ్యాభిషిక్తుడవై, రాచ కార్యములు చక్కబెట్టుకో.  ఈ నాలుగునెలలు నేను, లక్ష్మణుడు, ఈ పర్వతము మీద నివాసము ఉండెదము. కార్తీక మాసము రాగానే సీతను వెదకడానికీ, సీతను అపహరించిన రావణుని చంపడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అదీ మన ఒప్పందము. మిత్రమా! ఇప్పుడు నీవు కిష్కింధకు వెళ్లి పట్టాభిషిక్తుడివి కా!" అని పలికాడు రాముడు.

రాముని అనుజ్ఞపొంది సుగ్రీవుడు కిష్కింధకు బయలు దేరాడు. సుగ్రీవుడు వెళుతుంటే వానరులందరూ ఆయనకు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నారు. సుగ్రీవుడు వారిని లేవదీసి ఆదరిస్తున్నాడు. వానరులందరూ సుగ్రీవుని కిష్కింధకు రాజుగా అభిషిక్తుని చేసారు.
బంగారుతో చేసిన తెల్లని గొడుగును, తెల్లని వింజామరలను సిద్ధం చేసారు. రత్నములు, మణులు, మాణిక్యాలు సుగ్రీవునికి సమర్పించారు. సుగంధ ద్రవ్యములు, తేనెను, నవధాన్యములను సిద్ధం చేసారు. తూర్పుగా ప్రవహించే నదుల నుండి, నాలుగు సముద్రముల నుండి బంగారు కలశములలో పుణ్యజలములు తీసుకొని వచ్చారు. బ్రాహ్మణులకు దానములు చేసారు. అగ్నిని ప్రజ్వరిల్లజేసి హోమం చేసారు. వానర శ్రేష్టులు అయిన గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గన్ధమానుడు, మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా ఇతర వానర ప్రముఖులు పుణ్యజలములతో సుగ్రీవుని అభిషేకించారు.

వానరులందరూ ఆనందంతో ఊగిపోయారు. అదే సమయంలో వాలి కుమారుడైన అంగదుని
యువరాజుగా అభిషేకించారు. అంగదునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేసినందుకు సుగ్రీవుని అందరూ అభినందించారు. సుగ్రీవుని రాజుగా అభిషిక్తుడు కావడానికి, అంగదుడు యువరాజుగా అభిషిక్తుడు కావడానికి కారణమైన రామలక్ష్మణులను అందరూ వేనోళ్ల స్తుతించారు. సుగ్రీవుడు కిష్కింధా రాజ్యమును, తన భార్య రుమను మరలా పొంది ఇంద్రుని వలె రాజ్యపాలన సాగించాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)