శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 25)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది ఐదవ సర్గ
తరువాత రాముడు సుగ్రీవుని, తారను, అంగదుని ఓదారుస్తూ ఇలా అన్నాడు. “మీరు ఈ ప్రకారంగా ఒకరికి మించి ఒకరు శోకంతో రోదిస్తుంటే, ఏమీ ప్రయోజనము లేదు. జరుగ వలసిన కార్యము గురించి ఆలోచించండి. మీరు ఈవిధంగా శోకిస్తుంటే మరణించిన వాలి ఆత్మకు శాంతి కలుగదు. లోకాచారము ప్రకారము వాలికి జరుగ వలసిన అంత్య క్రియల గురించి ఆలోచించండి.ముల్లోకములు కాలమునను సరించి నడుస్తున్నాయి. మానవులు చేసే కర్మలకు అన్నింటికీ కాలమే మూలము. కాలము ననుసరించి అందరూ కాలధర్మము చెందవలసిన వారే. కాకపోతే కొంచెం అటు ఇటు అంతే. సమస్త భూతములను కర్మచేయమని ప్రేరేపించునది కాలమే కదా! అంతే కానీ, ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. అలా చేయడానికి సమర్థులు కూడా కారు. జనన మరణాలను నిర్ణయించేది కాలమే కానీ వేరు కాదు. ముల్లోకములు ఆ కాలమునకు లోబడి ప్రవర్తించవలసినదే!
ఆ కాలము కూడా తన ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించ జాలదు. దానికీ ఒక నియమము ఉంది. కాలాన్ని మార్చడానికి ఎవరి తరమూ కాదు. ఏ వస్తువూ కాల స్వభావమును దాటలేదు. అంతే కాదు. కాలము ఎవరి పక్షమూ వహించదు. కాలమునకు పక్షపాతము లేదు. కాలమును ఎవరూ వశము చేసుకోలేరు. ఎవరూ జయించలేరు. మిత్రులు కానీ, శత్రువులు కానీ, జ్ఞాతులు కానీ, ఏ కులము కానీ, ఏ జాతీ కానీ, కాలానుగుణంగా ప్రవర్తించవలసిన వారే కానీ ఎవరూ కాలమును వశపరచుకోలేరు. కాబట్టి తెలివి కలవారు, కాలము యొక్క స్వభావమును పరిశీలించి, తెలుసుకొని, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు.
వానర రాజు అయిన వాలి ఈ దేహమును విడిచి తన స్వస్వరూపమును పొందాడు. వాలి అశాశ్వతమైన ఈ దేహమును అంటిపెట్టుకొని ఉండక, శాశ్వతమైన స్వర్గలోకమునకు వెళ్లాడు. అందుకని, మీరు వాలి కోసరం శోకించడం మాని, కాలోచితముగా జరగవలసిన కార్యముల గురించి ఆలోచించండి." అని రాముడు కాల స్వభావమును తెలిపి, జరుగ వలసిన కార్యములను జరిపించమని సుగ్రీవునికి చెప్పాడు.
రాముని మాటలు విన్న లక్ష్మణుడు, సుగ్రీవుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. “ఓ సుగ్రీవా! రాముడు చెప్పిన మాటలు వింటివి కదా! వెంటనే వాలికి జరుగ వలసిన ప్రేతకార్యములు, దహన సంస్కారములు గూర్చి ఆలోచించు. వాలి దహన సంస్కారమునకు కావలసిన ఎండి పోయిన కాష్ఠములు (కట్టెలు) చందనపు కర్రలు తెప్పించు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోతున్న అంగదుని ఓదార్చు. కిష్కింధకు ఇంక నీవే దిక్కు. పుష్పమాలలు, సుగంధ ద్రవ్యములు, వస్త్రములు, నెయ్యి, ఇతరములు తెప్పించు. వాలిని ఊరేగింపుగా తీసుకొనిపోవుటకు ఒక పల్లకినీ సిద్ధం చేయండి. దానిని మోయుటకు తగిన బలిష్ఠులైన వాహకులను ఏర్పాటు చేయండి. ఈ కార్యములు అన్నీ వేగంగా జరగాలి. ఈ సమయంలో ఆలస్యము పనికిరాదు." అని లక్ష్మణుడు సుగ్రీవునితో చెప్పి, రాముని పక్కన వచ్చి నిలబడ్డాడు.
తారుడు పల్లకినీ దానిని మోయడానికి బలిష్ఠులైన వానరులను సిద్ధం చేసాడు. ఆ పల్లకిలో వాలిని కూర్చోపెట్టడానికి తగిన ఆసనము ఏర్పాటు చేసారు. పల్లకి రాగానే రాముడు లక్ష్మణునితో "ప్రేత కార్యము ప్రారంభించండి" అని ఆదేశించాడు. సుగ్రీవుడు మొదలగు వానరులు వాలిని మంచి వస్త్రములతోనూ, పూలమాలలతోనూ అలంకరించారు. వాలిని పట్టుకొని తీసుకొనివెళ్లి ఆ పల్లకిలో కూర్చోపెట్టారు.
సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు: "ఇప్పుడు మనము అన్నగారైన వాలికి ప్రేతకార్యము నిర్వర్తించాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయండి. కొంత మంది వానరులు పల్లకి ముందు నడుస్తూ రత్నములను వెదజల్లండి. భూలోకములో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండునో అట్టి ఐశ్వర్యములతో వాలికి అంతిమ సత్కారములు చేయండి" అని ఆజ్ఞాపించాడు.
సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వాలికి అంతిమ సంస్కారాలు జరిగాయి. తారుడు మొదలగు వానరులు తండ్రిని కోల్పోయిన అంగదుని పట్టుకొని విలపిస్తూ పల్లకీ వెంట వెళ్లారు. వాలి భార్యలందరూ భర్తను గురించి ఆయన గుణగుణములను తలచుకుంటూ పల్లకీవెంట నడిచారు. వానరులు నదీ తీరంలో, జనావాసాలకు దూరంగా, సమతల ప్రదేశంలో, ఒక ఇసుక దిబ్బ మీద చితిని ఏర్పాటు చేసారు. తరువాత వానర ప్రముఖులు పల్లకీనుండి వాలి మృతదేహమును కిందికి దించారు. తార తన భర్త మృతదేహమును ఒడిలో పెట్టుకొని విలపించింది.
“నాధా! నీవు మరణనించిననూ నీముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు. చూడండి. నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందరినీ అనాధలుగా మార్చాడు. నాధా! చూడండి. నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడకు వచ్చారు. నీ మంత్రులు అందరూ నీచుట్టునిలబడి శోకించుచున్నారు. వారితో మాట్లాడు." అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తార. పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకొని వెళ్లారు.
“నాధా! నీవు మరణనించిననూ నీముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు. చూడండి. నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందరినీ అనాధలుగా మార్చాడు. నాధా! చూడండి. నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడకు వచ్చారు. నీ మంత్రులు అందరూ నీచుట్టునిలబడి శోకించుచున్నారు. వారితో మాట్లాడు." అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తార. పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకొని వెళ్లారు.
తరువాత అంగదుడు, సుగ్రీవుడు వాలి శరీరమును చితి మీద ఉంచారు. అంగదుడు తన తండ్రి వాలి చితికి శాస్త్రోక్తముగా నిప్పు అంటించాడు. తండ్రి చితి చుట్టు అప్రదక్షిణముగా తిరిగాడు. తరువాత అందరూ జలతర్పణములు విడవడానికి నదీ తీరానికి వెళ్లారు.
అంగదుడు, సుగ్రీవుడు మొదలగు వానరులు వాలికి జలతర్పణములు విడిచారు. అంతిమ సంస్కారములు పూర్తి అయిన తరువాత సుగ్రీవుడు అంగదుని ముందుంచుకొని, రాముని వద్దకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment