శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 24)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది నాలుగవ సర్గ
వాలి బతికి ఉన్నప్పుడు వాలి చావాలి అని కోరుకున్న సుగ్రీవుడు వాలి మృతదేహము చూడగానే దుఃఖము ఆపుకోలేక పోయాడు. రాముని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.“రామా! మిత్రమా! ఏదో ఆవేశంలో నా అన్న వాలిని చంపమని నిన్నుకోరాను. కానీ ఇప్పుడు నా అన్న మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు నా జీవితమే వ్యర్ధము అనిపిస్తూ ఉంది. ఇహలోక భోగముల మీద ఆసక్తి పోయింది. కిష్కింధకు మహారాజు వాలి మరణించాడు. కిష్కింధా మహారాణి తార, భర్త దేహము మీద పడి ఏడుస్తూ ఉంది. కిష్కింధా నగరమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. అంగదుని భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకూ రాజ్యాభిలాష చచ్చిపోయింది.
రామా! పూర్వము వాలి నా భార్యను అపహరించి, నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడని అతని మీద పట్టరాని కోపం ఉండేది. కానీ ఇప్పుడు చచ్చిపడి ఉన్న వాలిని చూస్తుంటే ఆ కోపం అంతా మటుమాయం అయింది. కోపం స్థానంలో దుఃఖము ఆవరించింది. కిష్కింధలో ఉండి రాజ్యము చేసే దాని కన్నా ఇదివరకు మాదిరి ఋష్యమూక పర్వతము మీద కందమూలములు, ఫలములు ఆరగిస్తూ ప్రశాంత జీవనం గడపడం మేలు అనిపిస్తూ ఉంది. నా అన్న వాలి లేకపోయిన తరువాత నాకు స్వర్గ సుఖములు కూడా వృధా అనిపిస్తూ ఉన్నాయి.
రామా! నా అన్న వాలి నన్ను ఎన్నడూ చంపాలి అని అనుకోలేదు. "పోరా పో! ఎక్కడైనా ప్రాణాలతో బతుకు పో" అని అనేవాడు. కాని నేను నా అన్న వాలిని చంపాలని అనుకున్నాను. అది ఆయన గొప్పతనం. ఇది నా అల్పబుద్ధి.
రామా! ఎంత రాజ్యము మీద కోరిక ఉన్నా, అన్నను చంపి రాజ్యము చేయాలనే కోరిక నాకు ఏనాడూ లేదు. నా అన్న వాలి తన ఉదార బుద్ధితో నన్ను చంపడానికి ఏనాడూ ఇష్టపడలేదు. కానీ నేను నా బుద్ధి పెడతోవబెట్టి నా అన్నను చంపడానికి నిన్ను ఆశ్రయించాను. నేను తప్పు చేసినపుడు నా అన్న నన్ను చిన్న చెట్టు కొమ్మతో కొట్టి బుద్ధి చెప్పేవాడు. కాని నేను నా క్రోధముతో, వక్రబుద్ధితో, వానర స్వభావముతో నా అన్ననే చంపడానికి పూనుకున్నాను. నా అన్నను చంపి ఎనలేని పాపమును మూటకట్టుకున్నాను. ఆ పాపము ఈ జన్మలో తీరేది కాదు. జన్మజన్మలకూ నన్ను వెంటాడుతూ ఉంటుంది.
పూర్వము ఇంద్రుడు విశ్వరూపుని చంపి బ్రహ్మహత్యా పాతకము మూటగట్టుకున్నాడు. ఆ పాపమును భూమికి, జలానికి, వృక్షములకు, స్త్రీలకు, పంచి పెట్టాడు. కాని నేను నా అన్నను చంపిన పాపమును స్వీకరించడానికి ఎవరు ఉన్నారు రామా! నేను స్వయంగా అనుభవించాలి తప్పదు.
నా అన్నను చంపి నేను అధర్మానికి ఒడిగట్టాను. లోక నిందకు పాల్పడ్డాను. నేను రాజ్యాధికారమునకు అర్హుడను కాను. నేను చేసిన పాపము ఏనుగు రూపంలో నన్ను కకావికలు చేస్తూ ఉంది. నా శరీరంలో మంచితనము మృగ్యము అయి పోయింది. పాపం ప్రవేశించింది. తండ్రిని పోగొట్టుకొని అంగదుడు జీవించలేడు. కొడుకును పోగొట్టుకొని తార జీవించలేదు. నా అనే వాళ్లు అందరినీ పోగొట్టుకొని నేను మాత్రం జీవించడం ఎందుకు వృధా. నేను నా అన్న వాలితో పాటు అగ్నిలో ఆహుతి అవుతాను. ఈ వానరులు సీతను వెదకడంలో నీకు సాయపడతారు. నేను మరణించినా నీ కార్యము మాత్రం సిద్ధిస్తుంది. కులనాశమునకు కారణమైన నేను ఈ లోకంలో జీవించడం వృధా. నేను మరణించడానికి అనుమతి ఇవ్వండి.” అని రాముని ముందు దీనంగా వేడుకున్నాడు.
సుగ్రీవుని మాటలు విని రాముడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. రాముడు, భర్త శవం మీద పడి ఏడుస్తున్న తార వంక చూచాడు. తార తల ఎత్తి రాముని వంక చూచింది. చేతిలో ధనుర్బాణములను ధరించి ఠీవిగా నిలబడి ఉన్న సూర్యుని వంటి తేజస్సుతో వెలిగిపోతున్న రాముడిని చూచింది. తన భర్తను చంపిన రాముడు అతడే అని గుర్తించింది. తార, భర్త శవం పక్కనుండి లేచి, రాముని వద్దకు వెళ్ళింది.
“రామా! నీవు ధర్మపరుడవు. ఇంద్రియములను జయించిన వాడవు. కీర్తివంతుడవు. అమితమైన పరాక్రమ వంతుడవు. ధనుర్బాణములను ధరించిన వాడవు. నా పట్ల కూడా నీ ధర్మం నెరవేర్చు. భర్తలేనిదే భార్యకు జీవితం లేదు. ఏ బాణంతో నా భర్త ప్రాణం తీసావో అదే బాణంతో నా ప్రాణం కూడా తియ్యి. నన్ను నా భర్త వద్దకు పంపు. దయచేసి ఆ పుణ్యం కట్టుకో. ఎందుకంటే నా భర్త స్వర్గానికి పోయినా అక్కడ ఉన్న అప్పర స్త్రీల వంకచూడడు. నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను దగ్గర లేకపోతే వాలికి స్వర్గం కూడా నిస్సారంగా కనిపిస్తుంది. కాబట్టి నన్ను కూడా చంపి నా భర్త వద్దకు పంపు. నేను స్త్రీ అనీ, స్త్రీని చంపితే స్త్రీ హత్యా పాతకము చుట్టుకుంటుందని సందేహించకు. నేను కూడా వాలినే అనుకో. అప్పుడు నీకు ఆ దోషం అంటదు. ఒకసారి వివాహము అయిన తరువాత భర్త, భార్య వేరు కాదు. ఇరువురి శరీరాలు ఒకటే. ఇది వేదములలో చెప్పబడినది. కాబట్టి వేదవిహితమైన కార్యము దోషము కాదు కదా!
ఓ రామా! ఈ పెద్దలు నన్ను నా భర్తను వేరు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. నువ్వు నన్ను చంపితే నేను కూడా సత్వరమే నా భర్త వద్దకు చేరుకుంటున్నాను. నీవు ఇప్పుడు నన్ను చంపకపోయినా, వాలి లేకుండా నేను ఎక్కువ కాలము జీవించలేను. కాబట్టి నన్ను వెంటనే చంపు." అని రాముని దీనంగా వేడుకుంది తార.
దీనాలాపనలు విని రాముడు చలించి పోయాడు. ఆమెను చూచి ఇలా అన్నాడు.
“అమ్మా తారా! నువ్వు వీరుని భార్యవు. ఇలా బేలగా మాట్లాడటం తగదు. నువ్వు విపరీతంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడు. సృష్టిలోని అన్ని జాతులకూ సుఖ దు:ఖాలను పెట్టాడు. ఎవరు కూడా బ్రహ్మ సృష్టిని అతిక్రమించ లేరు. కాబట్టి దుఃఖము మాని ఓర్పు వహించు. కిష్కింధా రాజ్యానికి నీ కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. నీవు వీర పత్నివి. వీర మాతవు. ఇది బ్రహ్మ విధించిన అందరికీ సమ్మతమైన విధానము. దీనిని ఎవరూ అతిక్రమించలేరు. నీ వంటి వీర పత్ని ఇలా విలపించరాదు."అని రాముడు తారతో చెప్పాడు.
శ్రీమద్రామాయణము,
కిష్కింధా కాండము ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment