శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 23)

శ్రీమద్రామాయణము

కిష్కింధాకాండము

ఇరువది మూడవ సర్గ

తార తన భర్త ముఖాన్ని చూస్తూ తట్టుకోలేక ఈ విధంగా విలపిస్తూ ఉంది. “నాధా! అర్థరాత్రి సుగ్రీవునితో యుద్ధానికి పోవద్దని నేను నీకు శతవిధాలా చెప్పాను. కానీ నీవు నా మాటను పెడచెవిని పెట్టావు. అందుకే నేను ఇక్కడే ఉన్నా భూదేవిని కౌగలించుకొని పడుకున్నావు. ముల్లోకాలను గడగడలాండిచి ఎవరికీ లొంగని నీవు, నీ తమ్ముడు, నీ కన్నా దుర్బలుడైన సుగ్రీవుని చేతిలో ఓడిపాయావా! ఎంత ఆశ్చర్యము.

నాధా! వానర నాయకులు, భల్లూకనాయకులు నిన్ను సేవించడానికి వచ్చారు. లే. వారిని ఆదరించు. వారితో మాట్లాడు. నీవు నీ శత్రువులను చంపి వారిని భూతల శయనము చెందేట్టు చేసావు. ఇప్పుడు నీవు కూడా నీశత్రువు చేతిలో చంపబడి భూతలము మీద శయనించి ఉన్నావా!

నాధా! నన్ను అనాధనుచేసి నీవు ఒంటరిగా వెళ్లిపోవడం నీకు న్యాయంగా ఉందా నాధా! ఈ లోకంలో బుద్ధి ఉన్న వాడు ఎవ్వడూ తన కుమార్తెను వీరుడికి, పరాక్రమవంతుడికి ఇవ్వకూడదు. ఎందుకంటే శూరుడి భార్యకు నా మాదిరి అకాల వైధవ్యము తప్పదుకదా! వారు శోక సముద్రములో మునిగి పోక తప్పదు కదా! నీ మరణము కనులారా చూచికూడా నా హృదయము బద్దలు కాలేదంటే, నా గుండె కటిక పాషాణముతో సమానము కదా! 

నాధా! ఈ లోకంలో స్త్రీకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత వైభవము ఉన్నా, భర్త లేకపోతే ఆమెను విధవ అనే అంటారు. అటువంటి వైధవ్యము నాకు సంప్రాప్తించింది. ఎలాభరించాలి! ఈ సమయంలో నిన్ను తనివిదీరా కౌగలించుకొని ఏడవకుండా నీ శరీరం రక్తసిక్తమయింది. సుగ్రీవుని ఆశలు నెరవేర్చిన ఈ రాముని బాణము ఇంకా నీ శరీరంలో ఎందుకు ?"అంటూ తార వాలి శరీరంలో నుండి రాముని ధనుస్సు వెడలిన బాణమును బయటకు లాగింది.

వాలి శరీరంనుండి రామ బాణమును బయటకు లాగ గానే, ఆ గాయము నుండి రక్తం జలధార మాదిరి పైకి ఉబికింది. తార తన కళ్లనుండి నీరు కారుతుండగా వాలి గాయము నుండి స్రవించిన రక్తాన్ని తుడిచింది. తార తన కుమారుడు అంగదుని చూచి ఇలా అంది.

“నాయనా! అంగదా! నీ తండ్రిని కడసారి చూచి నమస్కారం చెయ్యి." 

వెంటనే అంగదుడు పైకి లేచి తన తండ్రి వాలికి భక్తితో నమస్కారం చేసాడు. 

“నాధా! నేను తమరి కుమారుడు అంగదుడు మీపక్కనే కూర్చుని ఉన్నాము. తమరి కుమారుడు అంగదుడు నమస్కరించు చున్నాడు. ఆశీర్వదించండి" అని విలపించింది తార.

ఓనాధా! మీరు, మీ తమ్ముడు సుగ్రీవునితో యుద్ధము అనే యజ్ఞమును చేసి, మీ భార్యనైన నేను లేకుండానే, రక్తంతో అవభృధ స్నానం చేస్తున్నారా! నా మాట వినకుండా యుద్ధమనే యజ్ఞము చేసి ఒంటరిగా అవభృధ స్నానం చేసారా! నాధా! మరణించింది నీవు మాత్రమే కాదు. నేను, నా కుమారుడు అంగదుడు కూడా మరణించాము. జీవచ్ఛవాల మాదిరి మిగిలిపోయాము. నీవు మమ్ములను విడిచిపోయినట్టు మా ఐశ్వర్యము కూడా మమ్ములను విడిచి పెట్టి పోయింది.” అని ఏడుస్తూ ఉంది తార.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)