శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 22)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ఇరువది రెండవ సర్గ

అప్పటికి వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తార వంక చూచాడు. తన కుమారుడు అంగదుని వంక, తార వంక మార్చి మార్చి చూచాడు. సుగ్రీవుని తన దగ్గరకు పిలిచాడు. అతి కష్టం మీద ఇలా అన్నాడు.

“సుగ్రీవా! నేను నీ పట్ల చాలా అపరాధము చేసాను. నన్ను క్షమించు. నా బుద్ధి వక్రించి నీ భార్యను నా దగ్గర ఉంచుకొని నిన్ను రాజ్యము నుండి వెడలగొట్టాను. మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండవలెనని బ్రహ్మ రాసి ఉన్నాడు. అందుకే నేను యమలోకమునకు పోతున్నాను. నీవు ఈ కిష్కింధను పాలించు. ఎవరి చేతిలోనూ ఓడి పోని నేను రామునిచేతిలో ఓడిపోయాను. ధర్మానికి ఓడిపోయాను.

నా మరణావస్థలో నేను నీకు ఒక మాట చెపుతాను. సావధానంగా విను. వీలైతే ఆచరణలో పెట్టు. నా కొడుకు అంగదుడు. చిన్నవాడు. చూడు ఎలా నేల మీద పడి పొర్లుతున్నాడో. అంగదుడు చిన్నప్పటి నుండి. సుఖాలలో పెరిగాడు. కష్టము అంటే ఎరుగడు. వాడిని నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా చూచుకున్నాను. నా కుమారుడు అంగదుని నీ కుమారునిగా భావించు. వాడికి ఏ లోటూ రాకుండా చూచుకో. ఇంక మీదట నుండి అంగదునికి తండ్రివి, దాతవు, రక్షకుడివి, అభయ ప్రదాతవు అన్నీ నువ్వే.

అంగదుడు నీకు అన్ని విధాలా తోడ్పడగలడు. యుద్ధములో నీకు అండగాఉండి అన్ని విధాలా నా కొడుకు అనిపించుకుంటాడు. ఇంక ఈమె నా భార్య తార. సుషేణుని కుమార్తె. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోడంలో సమర్థురాలు. ఎటువంటి ఉపద్రవకర పరిస్థితులకు కూడా ఎదురు నిలిచి, సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కలది. తార ఆలోచించి చేయమన్న కార్యమును నీవు నిస్సందేహంగా చేయవచ్చును. నీకు జయం లభిస్తుంది.
తరువాత, నీవు రామునితో ఏ కార్యము నిమిత్తము మైత్రి చేసుకున్నావో ఆ కార్యమును తక్షణం నెరవేర్చు. రాముడిని అవమానించకు. మోసగించకు. అలాచేస్తే రాముడు నా మాదిరి నిన్ను కూడా చంపుతాడు.

సుగ్రీవా! నా మెడలో ఉన్న బంగారు మాల నాకు ఇంద్రుడు ఇచ్చాడు. దానిని నీవు వెంటనే తీసుకో. అది నా ఒంటిమీద ఉండగా నేను చనిపోతే దానికి శవదోషం తగులుతుంది. అప్పుడు దాని మహత్తు పోతుంది. కాబట్టి వెంటనే తీసుకొని నీ మెడలో వేసుకో.” అని అన్నాడు వాలి.

వాలి మాటలు విని సుగ్రీవునికి దుఃఖము పొర్లుకొచ్చింది. ఏడుస్తూనే వాలి మెడలో ఉన్న బంగారు మాలను తీసుకొని తనమెడలో వేసుకున్నాడు. వాలి అంగదుని వంక చూచి ఇలా అన్నాడు. “కుమారా! అంగదా! ఇంక మీదట నీకు అన్నీ నీ పినతండ్రి సుగ్రీవుడే. సు:ఖము వచ్చినా, దు:ఖము వచ్చినా ఓర్చుకో. కాలానుగుణంగా ప్రవర్తించు. సుగ్రీవుని ఆజ్ఞలను పాలించు. నేను కాబట్టి నీవు ఏమి చేసినను ఓర్చుకున్నాను. సహించాను. కాని ఇదివరకటి మాదిరి చేస్తే సుగ్రీవునికి కోపం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకో. సుగ్రీవునికి కోపం తెప్పించకు.

ఇంకొక మాట. నీవు ఇంక మీదట సుగ్రీవుని అధీనంలో ఉండబోతున్నావు. సుగ్రీవుని శత్రువులతో స్నేహం చేయకు. అలాగే సుగ్రీవుని మిత్రులతో శత్రుత్వం పెట్టుకోకు. సుగ్రీవునికి ఇష్టమైన పనులనే చేస్తూ ఉండు. ఇంకొక విషయం. నీవు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ, అలాగే ఎక్కువ ద్వేషము కలిగి ఉండకు. ఎందుకంటే అతిగా ఉండటం ఎప్పుడూ అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి రాగద్వేషాలలో సమతుల్యం పాటించు. మధ్యస్తంగా వ్యవహరించు.”

అలా మాట్లాడుతూనే వాలి ఆఖరిశ్వాస విడిచాడు. వాలి మరణించాడు అని తెలియగానే వానరులందరూ బిగ్గరగా ఏడవడం మొదలెట్టారు. వాలి మరణంతో కిష్కింధా నగరము కళావిహీన మయింది. వాలి యొక్క పరాక్రమము, వీరత్వము, వాలి చేసిన యుద్ధములు, వాలి చంపిన వారి గురించి వానరులు తలచుకొని తలచుకొని ఏడుస్తున్నారు. తన కళ్ల ఎదుటే ప్రాణాలు విడిగిన తనభర్త వాలినిచూచి తట్టుకోలేక తార వాలి శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)