శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 21)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఇరువది ఒకటవ సర్గ
తార అలా ఏడుస్తుంటే హనుమంతుడు ముందుకు వచ్చి ఆమెను ఓదారుస్తున్నాడు.“అమ్మా! తారా! మనము చేసిన కర్మలను బట్టి ఫలితాలు వస్తుంటాయి. వాలి తాను చేసిన అకృత్యములకు ఫలితము అనుభవించాడు. దీనికి చింతించి ప్రయోజనము లేదు. ఈ దేహములు నీటి బుడగలు. కాలానుగుణంగా అవి బద్దలు అవుతుంటాయి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వారమే. పోయిన వాలి గురించి విచారించే కంటే బతికి ఉన్న అంగదుని క్షేమం గురించి విచారించు. పుట్టిన ప్రతి ప్రాణీ చావక తప్పదు. కాబట్టి చనిపోయిన వారి గురించి ఆలోచించక, నీ శేషజీవితములో శుభం కలగాలని కోరుకో! అదే ప్రస్తుత కర్తవ్యము.
ఇప్పటి దాకా ఈ కిష్కింధలో ఉన్న వేలకొలది వానరులు వాలి సంరక్షణలో హాయిగా జీవించారు. ఇప్పుడు వాలి లేడు. స్వర్గమునకు వెళ్లాడు. స్వర్గసుఖములు అనుభవించుచున్న వాలి గురించి దు:ఖించడం అవివేకము. ఈ కిష్కింధలో ఉన్న వేలాది వానరులకు, భల్లూకములకు వాలి మరణానంతరము నీవు, అంగదుడు రక్షకులు. అంగదునికి పట్టాభిషేకము చేస్తాము. నీ సంరక్షణలో అంగదుడు రాజ్యము చేస్తాడు. తదుపరి కార్యక్రమములు నిర్వర్తించమని సుగ్రీవునికి ఆదేశములు ఇవ్వు. ఇప్పుడు అంగదుడు, సుగ్రీవుడు, వాలికి శాస్త్రములలో నిర్ణయింపబడినట్టు ఉత్తర క్రియలు నిర్వహించాలి. వాలికి దహన సంస్కారములు చెయ్యాలి." అని పలికాడు హనుమంతుడు.
భర్త మరణముతో బాధ పడుతున్న తార, హనుమంతుని మాటలు విని ఇలా అంది. "హనుమా! నాకు నా భర్త లేకపోయిన తరువాత అంగదుని వంటి కుమారులు నూరు మంది ఉన్నా ఏమి ప్రయోజనము. నా శక్తి, నా సామర్థ్యము అన్నీ నా భర్తతోనే పోయాయి. నేను అశక్తురాలను. అన్ని వ్యవహారములు అంగదుని పినతండ్రి సుగ్రీవుని ఆజ్ఞప్రకారమే చెయ్యండి. అంగదుని యోగక్షేమములు విచారించుటకు నేను అర్హురాలిని కాను. అది తండ్రి బాధ్యత. తండ్రి లేనపుడు పినతండ్రి బాధ్యత. కాబట్టి అంగదుని యోగక్షేమముల గురించి సుగ్రీవుడు చూచుకొన గలడు. ఇన్నాళ్లు నేను నా భర్త వాలిని సేవించాను. ఇప్పుడు ఆయన పోయిన మార్గమునే అనుసరిస్తాను. నా భర్త పక్కనే నేను ఉంటాను. ఇది నా నిశ్చయము.” అని పలికింది తార.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment