శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరవదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 20)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ఇరవదవ సర్గ

రాముని బాణం దెబ్బతిని చావుబతుకుల్లో ఉన్న భర్త వాలిని చూచి తార భోరున ఏడిచింది. “ఓ వీరుడా! నీవు లోకోత్తర వీరుడవే. నీ వీరత్వము, పరాక్రమము ఏమైపోయాయి. ఎందుకు ఇలా దీనంగా నేల మీద పడి ఉన్నావు. నేను, నీ భార్య తారను, వచ్చాను. లే. నన్ను పలకరించు. నీవు మహారాజువు. ఇలా నేల మీద పడుకోవడం తగునా. లేచి మెత్తని హంసతూలికా తల్పం మీద పడుకో. ఓ భూనాధా! ఇన్నాళ్లు ఈ భూమిని పాలించిన నీవు, అవసాన సమయంలోకూడా భూదేవిని వదల లేక. ఆమెను కౌగలించుకొని పడుకున్నావా!

ఓ వానరవీరా! ఎంతో కష్టపడి, స్వర్గాన్ని తలదన్నే విధంగా, ఈ కిష్కింధను నిర్మించావు. ఇప్పుడు ఆ కిష్కింధను వదిలి ఎక్కడకు పోతున్నావు? నాధా! నేను నీ వియోగము తట్టుకోలేకున్నాను. నన్ను విడిచి వెళ్లవద్దు. నిన్ను ఈ స్థితిలో చూచి కూడా నా హృదయం బద్దలు కాలేదంటే, నా గుండె కఠినమైన పాషాణము అనుకుంటాను. అయినా కాలగతిని ఎవరు తప్పించగలరు. ఈ కాలమే నిన్ను సుగ్రీవుని చేతిలో మరణించేట్టు చేసింది.

నాధా! నేను నీకు భార్యగా ఉన్నాను. నేను కాకుండా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదా! కానీ నీవు ఆ సుగ్రీవుని భార్యను కోరుకున్నావు. అతనిని రాజ్యము నుండి వెళ్లగొట్టావు. దాని ఫలితమే నీకు సంప్రాప్తించిన ఈ దుర్మరణం. నాధా! నీవు సుగ్రీవునితో యుద్ధానికి పోకముందు ఎన్నోవిధాలుగా చెప్పాను. సుగ్రీవునితో సంధి చేసుకోమన్నాను. కానీ నీవు నా మాటలను పెడచెవిని పెట్టావు. పైగా నన్ను నిందించావు. కోరి కోరి మరణాన్ని కౌగలించుకున్నావు.

నాధా! రాముడు నిన్ను చంపినందుకు నేను విచారించడం లేదు. కానీ ఏ నాడూ కష్టము గానీ, దు:ఖము కానీ అనుభవించని నేను ఈ వైధవ్య దు:ఖమును అనుభవించవలసి రావడం చాలా బాధగా ఉంది. నాధా! నీ కుమారుడు అంగదుని చూడండి. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు. ఇప్పుడు పినతండ్రి సుగ్రీవుని వశమయ్యాడు. ఎన్ని బాధలు పడతాడో ఏమో!
నాయనా! అంగదా! నీ తండ్రివాలిని చూడు. కడసారి దర్శనం చేసుకో. ఇంక మీదట రోజూ చూచే నీ తండ్రి ముఖం రేపటి నుండి నీకు కనిపించదు. నాథా! నీ కుమారుడు అంగదుడు నిన్ను పిలుస్తున్నాడు. అంగదుని పలకరించు. అతనికి జీవితంలో నడుచుకోవలసిన జాగ్రత్తలు చెప్పు.
నాధా! నిన్ను చంపడం ద్వారా రాముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

ఓ సుగ్రీవా! నీ కోరిక తీరింది కదా! ఇంక నీ భార్య రుమ నీకు లభిస్తుందిలే. నీవు ఏ దిగులు, భయమూ లేకుండా ఈ కిష్కింధను ఏలుకో! నీ అన్న వాలిని చంపించావు కదా! ఇంకనీకు అడ్డేముంది.

నాధా! నేను ఇంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కమాట కూడా పలుకవేమి? మాట్లాడు. నేనే కాదు. నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు. వారి వంక కన్నెత్తి చూడు. వారిని పలకరించు." అని తార, ఆమెతో వచ్చిన వాలి భార్యలు వలా వలా ఏడుస్తున్నారు. అంగదుని పట్టుకొని రోదిస్తున్నారు.
తారకు ఇంకా ఆశ చావలేదు. వాలి మరలా బతుకుతాడని ఆశతో వాలిని కుదిపి కుదిపి ఏడుస్తూ ఉంది. 

“ఓ నాధా! నేను, అంగదుడు ఏమి అపరాధము చేసామని మమ్ములను విడిచి పోతున్నావు. తెలిసో తెలియకో మేము నీ పట్ల ఏమైనా అపరాధము చేస్తే దానిని క్షమించు. నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను.” అని వాలి పాదాల మీద తల పెట్టి ఏడుస్తూ ఉంది తార. భర్త లేని బతుకు తనకు వ్యర్ధమని ఎంచి, తార తన భర్త వాలితో పాటు ప్రాయోపవేశము చెయ్యాలని నిర్ణయించుకుంది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)