శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 19)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

పంతొమ్మిదవ సర్గ

వాలిని రాముడు తన బాణంతో కొట్టడం, వాలి పడిపోవడం, చనిపోయే స్థితిలో ఉండటం వాలి భార్య తారకు తెలిసింది. వాలి, తారల కుమారుడు అంగదుడు ఆమె పక్కనేఉన్నాడు. తార, అంగదులు వాలి దుర్మరణానికి ఎంతో దు:ఖించారు. వాలి దగ్గరకు పరుగు పరుగున వస్తున్నారు.

అప్పటికే, ధనుస్సును ధరించి, కాలయముని మాదిరి నిలబడి ఉన్న రాముని చూచి వానరులు అందరూ పారిపోయారు. పారి పోతున్న వానరులను చూచింది తార. తార వారిని చూచి ఇలా పలికింది. "ఓ వానరులారా! ఇప్పటి వరకూ మీరు మీ రాజు వాలి వెంట ఉండే వాళ్లు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా పారిపోతున్నారు. రాజ్యం కోసరం సుగ్రీవుడు, తాను ఏమీ చేయలేక, రాముని సాయంతో మీ రాజు వాలిని చంపించాడు. మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడకండి. పారిపోకండి. నాతో రండి." అని అన్నది తార.

పారిపోతున్న వానరులు తార మాటలు విని వెనక్కు తిరిగి వచ్చారు. తారను చూచి ఇలా అన్నారు. “అమ్మా తారా! ముందు నీవు, నీ కుమారుడు అంగదుడిని రక్షించుకో. లేకపోతే రాముడు అంగదుడిని కూడా చంపుతాడు. సుగ్రీవునికి అడ్డం లేకుండా చేస్తాడు. రాముడు వాలిని చంపగానే, మేమందరమూ భయంతో పారిపోయాము. అమ్మా తారా! నీవు అంగదుని రాజుగా అభిషేకించు. మేమందరమూ అంగదుని, వాలిని సేవించినట్టు సేవిస్తాము." అని ఎవరికి తోచినట్టు వారు అరిచారు.

మరి కొందరు తారను చూచి "తారా! నీవు అంగదుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు. సుగ్రీవుడు, అతని మంత్రులు రాజదుర్గములను ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటిదాకా మనము సుగ్రీవుని అతని మంత్రులను నానా కష్టాలు పెట్టాము. వాళ్లు ఇప్పుడు మనమీద పగతీర్చుకొనే అవకాశం ఉంది. కాబట్టి నీవు అంగదునితో కలిసి పారిపో" అని సలహా ఇచ్చారు.

ఆ మాటలు విన్న తార వారితో ఇలా అంది. “ఓ వానరవీరులారా! నా సర్వస్వము అయిన నా భర్త పోయాక, నాకు ఈ రాజ్యంతో, నా కొడకుతో, ఈ శరీరంతో పనేముంది. నేను నా భర్త వద్దకు వెళ్లాలి. నా భర్త ఎక్కడ ఉన్నాడు. ఏస్థితిలో ఉన్నాడు." అంటూ ఏడుస్తూ వాలి వద్దకు పరుగెత్తింది.

దుందుభి లాంటి రాక్షసులను మట్టుబెట్టిన వాలి, పరాక్రమంలో దేవేంద్రునితో సమానమైన వాలి, మరణావస్థలో నేలమీద పడి ఉండటం చూచింది. వాలి దేహము పక్కన ధనుస్సు ఊతంగా పట్టుకొని నిలబడి ఉన్న రాముని, లక్ష్మణుని, తన భర్త వాలి తమ్ముడు సుగ్రీవునీ చూచింది. నేరుగా వెళ్లి తన భర్త శరీరం మీద పడిపోయింది. “ఆర్య పుత్రా! లేవండి. నేను మీ తారను వచ్చాను లేవండి." అంటూ రోదిస్తూ ఉంది.

తన వదిన తారను, తన అన్నకుమారుడు అంగదుని చూచి సుగ్రీవునికి దు:ఖము ఆగలేదు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)