శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునెనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 18)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

పదునెనిమిదవ సర్గ

వాలి అన్న మాటలు అన్నీ ఓపికగా విన్నాడు రాముడు. వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలను అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు.

"ఓ వాలీ! నీకు ధర్మము, అర్థము, కామము అంటే ఏమిటో తెలియవు. లోక మర్యాదలు తెలియవు. నన్ను మాత్రము నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు. నాతో మాట్లాడే ముందు. నన్ను నిందించే ముందు, నీవు నీ పెద్దలతో, పండితులతో చర్చించి ఉండాల్సింది.

ఈ అరణ్యములు, పర్వతములు, సమస్తజంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి. ఈ అడవిలోని జంతు జాలమును. మనుష్యులను, రాక్షసులను రక్షించడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఇక్ష్వాకు వంశము రాజులకే అధికారము కలదు. ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యసత్యవ్రతుడు. ధర్మము తెలిసినవాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయగల సమర్ధుడు. భరతుడు దేశ, కాల, మాన పరిస్థితులను గుర్తెరిగి పాలించే రాజు.

భరతుని ఆజ్ఞమేరకు, ధర్మరక్షణ చేయుటకు, మేము ఈ ప్రాంతం అంతా సంచరిస్తున్నాము. ధర్మనిరతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావు లేదు. ధర్మవిరుద్ధముగా ఎవరూ ప్రవర్తించరు. కాని మేము భరతుని ఆజ్ఞమేరకు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించే వారిని
గుర్తించి, వారిని తగిన విధంగా శిక్షిస్తూ, ధర్మరక్షణ చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మేము నీ రాజ్యమునకు వచ్చాము. నీవు ధర్మాతిక్రమణ చేసినట్టు ఋజువు అయింది. కామభోగములకు ప్రాధాన్యము ఇచ్చి, నిందార్హమైన పనులుచేసినట్టు మా దృష్టికి వచ్చింది.

నీకు ధర్మం గురించి చెబుతాను విను. జన్మనిచ్చిన తండ్రి, తనకన్నా ముందు పుట్టిన అన్న, విద్య చెప్పిన గురువు, వీరు ముగ్గురూ కన్న తండ్రితో సమానము. అలాగే, తన కన్నా తరువాత పుట్టిన తమ్ముడు, తన కుమారుడు, తన శిష్యుడు. పుత్రసమానులు. 

ఓ వానరా! సత్పురుషులు ఆచరించే ధర్మమును కేవలము ఆత్మతో తెలుసువలెనే కానీ, బాహ్య కర్మల వలన తెలుసుకోలేరు. గుడ్డి వాడిని మరొక గుడ్డివాడు నడిపించినట్టు, చంచల స్వభావుడవైన నీవు, నీ మాదిరే చంచల స్వభావులైన నీ తోటి వానరులతో ఆలోచించి ధర్మాధర్మనిర్ణయము చేయగలవా! నీవు ఇంతవరకూ నేను నిన్ను చంపాను అన్న కోపంతో మాట్లాడావు. నేను నిన్ను ఎందుకు చంపానో చెబుతాను విను. నీ తమ్ముని భార్య నీకు కోడలి వంటిది. నీవు ధర్మము తప్పి నీ సోదరుడు జీవించి ఉండగానే అతని భార్య రుమను కామాంధుడవై నీ వద్ద ఉంచుకున్నావు. 

ఓ వానరా! నీవు ధర్మమును అతిక్రమించి నీ తమ్ముడి భార్మను కామవాంఛతో తాకావు కాబట్టి, నీవు చేసిన పాపమునకు నీకు మరణదండన విధించడమైనది. లోకాచారమును మరిచి, ధర్మవిరుద్ధముగా ప్రవర్తించు వారికి మరణ దండనే సరి అయిన ప్రాయశ్చిత్తము. నేను ఉత్తమ కులములో పుట్టిన క్షత్రియుడను. ఇటువంటి అధర్మకార్యము సహించను. ఎవరైనా కామము చేత తన కుమార్తెను, సోదరిని, తమ్ముని భార్యను కోరితే, వారికి దండన విధించడం క్షత్రియ ధర్మము. ఆ ధర్మమే నేను నిర్వర్తించాను. మరలా చెబుతున్నాను. ఈ భూమి అంతా భరతుని రాజ్యములోనిది. మేము భరతుని ఆజ్ఞను పాలిస్తున్నాము. ధర్మరక్షణ చేస్తున్నాము. నీవు ధర్మమార్గము తప్పి నడుస్తున్నావు అని తెలిసి కూడా నిన్ను ఎలా క్షమించగలము. ధర్మము ప్రకారము రాజ్యము చేయు భరతుడు అధర్మపరులను నాశనం చేస్తాడు. మేము భరతుని ఆజ్ఞమేరకు నీవంటి అధర్మపరులను శిక్షించడానికి కంకణము కట్టుకున్నాము.

ఓ వానర రాజా! నీవు అన్నట్టు నేను సుగ్రీవునితో స్నేహం చేసాను కానీ, ధర్మబద్ధంగా స్నేహము చేసాను. దానికి మూలము రాజ్యము, నా భార్యసీత. సుగ్రీవుడు నాకు సాయం చేస్తాడు. నేను నా
అతనికి సాయం చేస్తాను. రెండూ ధర్మబద్ధంగా చేసే సహాయాలే. నేను వానరుల ఎదుట, నిన్ను చంపి సుగ్రీవునికి రాజ్యము ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. ఇందులో తప్పేముంది. ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మం కదా!
నేను పైన చెప్పిన కారణముల వలన నీకు ధర్మబద్ధంగా తగిన దండన విధింపబడింది. ఆ దండన నీవు అంగీకరించక తప్పదు. నీకు దండన విధించడం ధర్మసమ్మతము అని నీవు గ్రహించాలి. నేను ధర్మమును పాటిస్తున్నాను కాబట్టి స్నేహితుడవైన నీకు దండన విధించి
ఉపకారమే చేసాను.

ఈ సందర్భంలో నీకు మనువుచెప్పిన మాటలు వినిపిస్తాను విను. పాపములు చేసిన మానవులు, రాజులచే దండింపబడి, వారు చేసిన పాపములను పోగొట్టుకొని, పుణ్యాత్ములై స్వర్గమునకు వెళ్తారు. చేసిన పాపమునకు దండన అనుభవిస్తే, ఆ పాపము పోతుంది. ఆ నేరము చేసిన వాడు పాపము నుండి విముక్తుడవుతాడు. ఒక వేళ రాజు పాపము చేసిన వాడికి దండన విధించకపోతే, ఆ పాపము రాజుకు సంక్రమిస్తుంది. పూర్వము మాంధాత అనే చక్రవర్తి, నీవు చేసినటువంటి పాపమే చేసిన ఒక వ్యక్తిని దండించకుండా వదిలిపెట్టాడు. దాని ఫలితంగా, అతడు చేసిన పాపము మాంధాతకు సంక్రమించింది. ఒక్క మాంధాత కాదు. ఎంతో మంది రాజులు, దండించతగిన వారిని దండించకుండా వదిలిపెట్టి, పాపములను పొందారు.

ఓ వానర రాజా! నేనేదో స్వతంత్రంగా ప్రవర్తించి నిన్ను చంపాను అని అనుకోవద్దు. నేను స్వతంత్రుడను కాను. ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకోవలసిన వాడను. నా ఇష్టం వచ్చినట్టు
చేయడానికి వీలులేదు.

ఓ వానర రాజా! నిన్ను దండించుటకు మరొక కారణము కూడా చెబుతాను విను. మానవులకు, ప్రత్యేకించి క్షత్రియులకు, వేట నిషిద్ధము కాదు. జంతువులను వేటాడేటప్పుడు మాటు వేసిచంపడం సర్వసాధారణం. వేటలో మృగములు పరుగెత్తుతున్నా, భయపడి నిలిచిపోయినా, ఏమరిపాటుగా ఉన్నా, అటువంటి మృగములను చంపడం పాపం కాదు. ధర్మము తెలిసిన ఎంతో మంది రాజర్షులు కూడా వేటకు వెళ్లేవారు. నీవు వానరుడవు. మృగజాతికి చెందినవాడివి. అందుకని క్షత్రియధర్మము ప్రకారము నిన్ను వేటాడాను. నీవు నాతో యుద్ధం చేస్తున్నా లేక సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నా, నువ్వు వానరుడివే కదా! నువ్వు నాతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే చంపాలి అనే నియమం లేదు. అందుకని ఒక రాజుగా నిన్ను దండించే ప్రక్రియలో భాగంగా నిన్ను చంపాను.

రాజులు ధర్మమును రక్షించడానికే పుట్టారు. క్షత్రియులు మానవరూపంలో భూమి మీద నడయాడుతున్న దేవతలు. అందుచేత దండన విధించిన రాజులను నిందించడం ధర్మం కాదు. నేను మా తండ్రి తాతల నుండి అనుసరిస్తున్న ధర్మము ప్రకారము నీకు దండన విధించాను. నీవేమో ధర్మం తెలియక నన్ను నిందించావు.” అని అనునయంగా చెప్పాడు రాముడు.

రాముని మాటలు విన్న వాలికి కనువిప్పు కలిగింది. ధర్మము తెలుసుకున్న వాలి, రాముని యందు తప్పులేదని గ్రహించాడు. అప్పుడు వాలి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు.

“ఓ రామా! నీవు చెప్పినది అక్షరసత్యము. ఏ సందేహమూ లేదు. ధర్మం తెలియకుండా, అజ్ఞానంతో నేను పలికిన మాటలను పట్టించుకోవద్దు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడవు. ప్రజలకు మేలుచెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకొనేవాడివి. అందుకని ధర్మాధర్మ నిర్ణయమునకు నీవే సమర్ధుడివి.

ఓ రామా! నేను అధర్మంగా ప్రవర్తించాను. తగిన దండన అనుభవించాను. రామా! నా దిగులు అంతా నా కుమారుడు అంగదుడి గురించి. అంగదుడు చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగాడు. నేను కనపడకపోతే ఆహారమూ నీరూ ముట్టడు. నా కుమారుడు చిన్నవాడు. లోకానుభవము లేదు. వాడిని నీవు రక్షించాలి. నీవు సుగ్రీవుని యందు ఎంతటి అనురాగం చూపుతావో అదే మాదిరి అంగదుని కూడా దయతో చూడు.

ఓ రామా! నీవు నీ తమ్ములు లక్ష్మణుని, భరతుని ఏ విధంగా మన్నిస్తావో, అదే మాదిరి సుగ్రీవునీ, అంగదునీ మన్నించు. చేసిన తప్పంతా నాదే. ఇందులో నా భార్య తారకు ప్రమేయం లేదు. నేను చేసిన అపరాధమునకు నా భార్య తారను నా తమ్ముడు సుగ్రీవుడు అవమానించకుండా చూడు. నా భార్య తార నీ గురించి చెప్పి నన్ను వారించినా, నేను ఆమె మాటలను పెడచెవిని బెట్టి సుగ్రీవునితో యుద్ధానికి తలపడినందుకు ఫలితంగా నీ చేతిలో మరణిస్తున్నాను.” అనిపలికి మౌనంగా ఉన్నాడు వాలి.

వాలి పలికిన పలుకులు విన్న రాముడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. “ఓ వానర రాజా! నీ కొడుకు అంగదుని గురించి, నీ భార్య తార గురించి నీవు దిగులు చెందవద్దు. మరొక మాట. నేను నిన్ను అనవసరంగా అన్యాయంగా చంపానని నీవు మనసులో బాధపడవద్దు. నీవేదో మహా పాపము చేసావని తలంచ వద్దు. నీవు పొరపాటు చేసావు. నేను నిన్ను దండించడానికి నిశ్చయించుకున్నాను. శిక్షింప తగ్గవాడిని శిక్షించిన రాజు, శిక్ష అనుభవించతగి ఉండి. ఆ శిక్షను అనుభవించిన నేరస్తుడు, ఇద్దరూ ఉత్తమ గతులుపొందుతారు. ఆ కారణం చేత తప్పుచేసిన నీవు నేను విధించిన దండనతో నీవు చేసిన పాపములు అన్నీ తొలగిపోయాయి. నీవు ఇప్పుడు నీ సహజమైన వాలి స్థితిని (సుగ్రీవుని వెళ్లగొట్టి అతని భార్య రుమను కామంతో పొందక ముందు ఉన్న స్థితి) పొందావు.

ఓ వాలీ! ఇది దైవ నిర్ణయము. దీనిని తప్పించుకోలేవు. కాబట్టి నీలో ఉన్న కోపమును మోహమును విడిచి శాంతము వహించు. నీవు కోరినట్టు గానే, అంగదుడు ఇప్పటిదాకా నీ పట్ల ఎంతటి అనురాగాన్ని, ప్రేమను ప్రదర్శిస్తున్నాడో, సుగ్రీవుని పట్ల, నా పట్ల అదే అనురాగాన్ని ప్రదర్శించగలడు." అని వాలిని అనునయించాడు రాముడు.

రాముని మాటలను విని వాలి "ఓ రామా! నీవు నన్ను బాణంతో కొట్టి చంపావు అన్న కోపంలో శక్తి తగ్గి, కోపం పెరిగి, నిన్ను ఏమేమోఅన్నాను. నన్నుక్షమించు.” అని అన్నాడు వాలి.

తాను చేసిన ఆరోపణలకు రాముడు ఇచ్చిన సమాధానానికి హేతుబద్ధమైన ప్రతిసమాధానాన్ని ఇవ్వలేకపోయాడు వాలి. పైగా అవసాన దశలో ఉన్నాడు. శరీరం క్షణక్షణానికి క్షీణించి పోతూ ఉంది. శక్తి తగ్గిపోతూ ఉంది. వాలి ప్రాణాలు అతని దేహన్ని విడువ డానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో వాలి స్పృహ తప్పి పడిపోయాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)