శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునేడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 17)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
పదునేడవ సర్గ
రాముని బాణం దెబ్బ తిన్న వాలినేల మీద పడిపోయాడు. శరీరం పడిపోయింది కానీ అతని తేజస్సు తగ్గలేదు. వాలి మెడలో ఉన్న ఇంద్రమాల, అతని గుండెల్లో గుచ్చుకున్న రామ బాణము అతనిలో ఉన్న తేజస్సును సడలిపోనివ్వడం లేదు.తన బాణము దెబ్బకు వాలి పడి పోగానే, రాముడు, లక్ష్మణుడు వాలి దగ్గరకు వెళ్లారు. వాలి ముందు గౌరవ సూచకంగా తలవంచి నిలబడ్డారు. కొన ఊపిరితో ఉన్న వాలి రాముని చూచాడు. యుద్ధంలో గెలిచాను అన్న గర్వంతో ఉన్న రామునితో తనలో ఉన్న గర్వం తగ్గని వాలి ఇలా అన్నాడు. వాలి మాటల్లో రాముని పట్ల వినయం ఉంది. కాని పౌరుషం తగ్గలేదు. ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు వాలి.
“నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ నీ మూలంగా మరణిస్తున్నాను. నేను నీతో యుద్ధం చేయడం లేదు కదా! నీవంక తిరిగి నీతో యుద్ధం చేయని వాడిని చంపి నీవు ఏం సాధించావు? నేను విన్నదానిని బట్టి రాముడు కులీనుడు. సత్త్వగుణ సంపన్నుడు. తేజస్వి. వ్రతనిష్ట కలవాడు. రాముడు కరుణామయుడు. ఎల్లప్పుడూ ప్రజలహితం కోరేవాడు. ఇతరుల పట్ల జాలి, దయ కలవాడు. ఉత్సాహవంతుడు. సమయస్ఫూర్తి కలవాడు. ధృడమైన బుద్ధికలవాడు. ఈ లోకంలో ఉన్న వారంతా నిన్ను పై గుణములతో కీర్తిస్తుంటారు కదా! పైగా నీవు రాజువు. రాజైన వాడు ఇంద్రియనిగ్రహము, ఓర్పు, ధైర్యము, బలము, పరాక్రమము, తప్పు చేసిన వారిని దండించే గుణము కలిగి ఉండాలి.
నీవు సుగ్రీవునికి అండగా, మిత్రుడుగా ఉన్నావని తార చెప్పింది. కానీ సకల సద్గుణ సంపన్నుడవైన నీవు తప్పు చేయవని నేను సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాను. నేను సుగ్రీవునితో యుద్ధం చేసేటప్పుడు నీవు నాకు కనపడలేదు. (అంటే రాముడు చెట్టు చాటునో పొదలమాటునో దాక్కుని ఉన్నాడని వాలి అంటున్నాడు.) కాని నీ బాణం దెబ్బ నాకు తగిలింది. అంటే నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తుంటే, నీవు నాకు కనపడకుండా మాటు వేసి నన్ను కొట్టావు అని నేను
అనుకుంటున్నాను.
ధర్మాత్ముడవు అని పేరుగాంచిన నీ బుద్ధి ఇంత చెడ్డదనీ, నీవు ధర్మాత్ముడు అనే ముసుగులో అధర్మాలను ఆచరించే దుర్మార్గుడవు అనీ, పాపాత్ముడవనీ, గడ్డితో కప్పబడిన నేలబావి లాంటి వాడివనీ నాకు తెలియక, నేను సుగ్రీవునితో ధర్మయుద్ధానికి తలపడ్డాను. రామా! నీవు సాత్వికుని వేషంలో ఉన్న పాపాత్ముడివి, నివురు కప్పిన నిప్పులాంటి వాడివి అని తెలుసుకోలేకపోయాను.
రామా! నేను నీ దేశానికి రాలేదు. నీ నగరానికి రాలేదు. నీ దేశంలో కానీ, నీ నగరంలో కానీ ఏ నేరమూ, తప్పూ చేయలేదు. నిన్ను నేను ఎన్నడూ అవమానించలేదు. నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నామానాన నేను అడవులలో ఉంటూ ఫలములు, మూలములు తింటూ బతుకుతున్నాను. నీవు నరుడవు. నేను కాయలు పండ్లు తినే వానరమును. పాపం చెయ్యడం అంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేయడం లేదు. మరొకరితో యుద్ధం చేస్తున్నాను. అటువంటి నన్ను ఏ కారణంతో చంపావు?
రామా! నీవు రాజులలో ప్రసిద్ధుడవు. ఎన్నో శాస్త్రములను చదివావు. ప్రస్తుతము జటలు, నారచీరలు ధరించి మునివేషములో ఉన్నావు. ముని వేషములో ఉన్న నీవు ఇటువంటి క్రూరమైన పని చేయడం తగునా!
రామా! నీవు రఘు వంశములో పుట్టావు. పైకి మాత్రం ధర్మానికి ప్రతిరూపంగా కనపడతావు. కాని లోలోపల దుష్టుడివి. నీవు క్రూరత్వానికి ప్రతిరూపం. లోకానికి మాత్రం ధర్మాత్ముడు, మంచి వాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు.
రామా! రాజుకు ఉండవలసిన గుణములు ఏవంటే---సామము, దానము, క్షమ, ధర్మగుణము, సత్యము పలకడం, పరాక్రమము, ధైర్యము. ఇవీ రాజుకు ఉండవలసిన గుణములు.
రామా! మేము అడవులలో ఉంటూ ఆకులు, కాయలు, పండ్లు తిని బతికే వానరులము. నీవు నరుడివి. నరులకు రాజువు. మీకు అనుభవించడానికి రాజ్యము, వెండి, బంగారము కావాలి. కాని ఎక్కడో మారుమూల ఉన్న నా అరణ్యరాజ్యము నీకు ఎందుకు?
నీతిగా ఉంటడం, వినయము కలిగి ఉండటం, దండించతగినవారిని దండించడం, నిరపరాధులను విడిచిపెట్టడం, ఇవీ రాజు పాటించవలసిన ధర్మములు. రాజులు ఈ ధర్మములకు లోబడి ప్రవర్తించాలి కానీ వారి ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించరాదు. కాని నీవు రాజువై ఉండీ పై ధర్మములను పాటించలేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీకు నీ కోరికలు తీరాలి. దాని కోసం ఏమి చెయ్యడానికైనా వెనుదీయవు. పైగా నీకు కోపం ఎక్కువ. నీ మనస్సు నిలకడలేదు. రాజధర్మములను ఆచరించడంలో నీకు స్థిరమైన బుద్ధిలేదు. ఆయుధము నీ చేతిలో ఉంది కదా అని అందరినీ చంపుకుంటూపోతావు. అదీ నీ తత్త్వము.
ఓ మనుజేశ్వరా! రామా! నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసీ నేను ఏ అపరాధమూ చెయ్యలేదు. అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు, ఎలా సమర్ధించుకుంటావు?
ఓ మనుజేశ్వరా! రామా! నీకు ధర్మాచరణములో శ్రద్ధ, భక్తి లేవు. నీవు కామానికి దాసుడవు. నీ కోరికలు ఎటు లాగితే అటు వెళతావు. నాకు తెలిసీ నేను ఏ అపరాధమూ చెయ్యలేదు. అటువంటి నన్ను అకారణంగా చంపావు. ఈ చర్యను లోకుల ముందు, సాటి రాజుల ముందు, ఎలా సమర్ధించుకుంటావు?
ఓ రామా! రాజును, బ్రాహ్మణుని, గోవును, అమాయకమైన జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు, వేదప్రమాణమును నమ్మని వాడు, ఇతరుల మీద చాడీలు చెప్పేవాడు, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, గురువుగారి భార్యను కామించేవాడు, నరకానికి వెళతారు. నేను మనిషినికాను జంతువును. నన్ను అకారణంగా చంపావు. నీకు ఏ గతి పడుతుందో ఆలోచించుకో?
నేను జంతువును కాబట్టి నన్ను వేటాడావు అని అనుకోడానికీ వీలు లేదు. ఎందుకంటే నన్ను వేటాడి, చంపినందువలన నీకు ఏమన్నా ప్రయోజనము ఉందా అంటే అదీలేదు. నా చర్మము దేనికీ పనికిరాదు. నా వెంట్రుకలు, ఎముకలు, మీ వంటి మంచివారు తాకను కూడా తాకరు. నా మాంసము తినడానికి పనికిరాదు. ఏ ప్రయోజనమూ లేకుండా నన్ను ఎందుకు వేటాడావు?
రామా! నీ క్రూర బుద్ధిని ఊహించిన నా భార్య నాకు హితోపదేశము చేసింది. కానీ గర్వాంధుడనై ఆమె ఉపదేశము పెడచెవిని పెట్టాను. తగిన ఫలితము అనుభవించాను. ఒక శీలవతికి దుర్మార్గుడైన భర్త ఉన్నా ఒకటే లేకా ఒకటే. అలాగే నీ రాజ్యానికి, ఈ భూమికి, దుర్మార్గుడైన, శీలవంతుడు కాని నీవంటిరాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! దొంగచాటుగా దెబ్బతీసేవాడివి, ఇతరులకు అకారణంగా హాని చేసేవాడివి, నీచ బుద్ధి కలవాడివి, పైకి మాత్రం మంచి వాడిగా కనిపిస్తూ లోపల కుచ్ఛితమైన బుద్ధి. కలవాడివి, పాపాత్ముడవు అయిన నీవు ఆ దశరథునికి కుమారుడిగా ఎలా జన్మించావో అర్థం కావడం లేదు. సత్పురుషులు, యోగ్యులు అయిన వాళ్లు నిందించే పనిని నీవు చేసావు. వారి ముందు నీ చర్యను ఎలా సమర్ధించుకుంటావు?
రామా! నేను నీకు శత్రువును కాను. మిత్రుడను కాను. నీవు నిజంగా వీరుడవు, పరాక్రమ వంతుడివి అయితే నీ శత్రువులతో యుద్ధం చేసి గెలువు. అదీ వీరత్వము అంటే! నేను నీకు శత్రువును అని నీవు అనుకుంటే, నాతో యుద్ధమే చేయాల్సింది. ఈ పాటికి నిన్ను యమునికి అతిధిగా పంపి ఉండేవాడిని. నన్ను ఎదిరించి పోరాడే ధైర్యము లేక, చేత కాక, చాటున ఉండి నన్ను చంపావు.
మద్యము మత్తులో నిద్రించు వాడిని పాము కాటు వేసినట్టు, నువ్వు నన్ను చాటునుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేసావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు.
మద్యము మత్తులో నిద్రించు వాడిని పాము కాటు వేసినట్టు, నువ్వు నన్ను చాటునుండి చంపావు. నీ భార్యను వెతికి పెట్టడానికి నీవు సుగ్రీవునితో స్నేహం చేసావు అని నాకు తెలిసింది. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి మేలు చేయడానికి నన్ను చంపావు.
రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చెయ్యడానికికి బదులుగా నీవు నా వద్దకు వచ్చి నాతో స్నేహం చేసి ఉంటే నేను ఆ రావణుని కాళ్లు చేతులు కట్టితెచ్చి నీ పాదాల ముందు పడవేసేవాడిని. ఆకాశములో గానీ, పాతాళములోకానీ, నీ సీత ఎక్కడ ఉన్నా వెతికి తెచ్చి నీకు అప్పగించి ఉండేవాడిని.
రామా! సుగ్రీవుడు నా సోదరుడు. నా తరువాత కిష్కింధకు రాజు అవుతాడు. అది ధర్మమే. కానీ నీవు నన్ను చాటునుండి చంపడం మాత్రం అధర్మము. క్షమించరాని నేరము. నీకు చేతనయితే నీవు చేసిన కార్యము ధర్మబద్ధము అని నిరూపించుకో." అని పలికి వాలి మౌనంగా ఉండిపోయాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment