శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునారవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 16)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

పదునారవ సర్గ

తార చెప్పిన మాటలు వాలి పెడచెవిని పెట్టాడు. తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు. విదిలించి కొట్టాడు. పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించి వేసింది.

“నా కన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందూ వెనకా ఆలోచిస్తూ కూర్చోవాలా! కుదరదు. నీవు భయస్తురాలవు. పిరికిదానికి. నా వంటి వీరుడు శూరుడు యుద్ధానికి వెనుదియ్యడం కన్నా మరణించడం మేలు. శత్రువు యుద్ధానికి కాలు దువ్వుతుంటే, ఓర్పుతో ఉండటం మరణం కన్నా సహించరానిది. ఇంక రాముని గూర్చి నాకు భయం లేదు. నీవే అన్నావు కదా. రాముడు ధర్మాత్ముడు. ఆర్తజనులను రక్షించేవాడు అని.

అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగడతాడు. సుగ్రీవుని కోసరం పాపం ఎలా చేస్తాడు? ఏదో స్త్రీసహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు. ఇంకచాలు లోపలకు వెళ్లు.
పిచ్చిదానా! నేను నా సోదరుని చంపుతాను అనుకున్నావా! లేదు. నేను కేవలం సుగ్రీవుని అహంకారము అణిచి బుద్ధి చెప్పి పంపేస్తాను. అంతే. ప్రస్తుతము సుగ్రీవుడు రాజ్యం కోరడం లేదు. యుద్ధం కోరుకుంటున్నాడు. వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను. నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ, నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు. అది చాలు. ఇంక లోపలకు వెళ్లు. నేను చిటికలో సుగ్రీవుని గర్వము అణిచి అతనిని పారిపోయేట్టు చేసి వస్తాను." అని పలికాడు వాలి.

తార ఇంక చేసేది లేక దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణ పూర్వక నమస్కారము చేసింది. భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతిలకము దిద్దింది. అంతఃపుర కాంతలతో సహా లోపలకు వెళ్లింది. వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు. అల్లంత దూరంలో నడుముకు ధట్టి కట్టుకొని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుని చూచాడు. వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్లాడు.

వాలి మెడలో ఇంద్రుడు ఇచ్చిన బంగారు మాల ఉంది. సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది. సుగ్రీవుని చూచి వాలి ఇలా అన్నాడు. 

“ఒరేయ్ సుగ్రీవా! ఈ పిడికిలితో గట్టిగా గుద్దితే చస్తావురా! నాతో ఎందుకురా నీకు" అని అన్నాడు.

"ఓ వాలీ! నాకూ పిడికిలి ఉంది. నేనూ నీ తల మీద ఒక గుద్దు గుద్దితే తలపగిలి చస్తావు." అని మాటకు మాట బదులు చెప్పాడు సుగ్రీవుడు. 

ఇంక వాలి ఊరుకోలేకపోయాడు. సుగ్రీవుని పిడికిలితో మోదాడు. సుగ్రీవునికి ఒళ్లంతా రక్తసిక్తము అయింది. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాలవృక్షమును పీకి వాలి మీదికి విసిరాడు. ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వయుద్ధమునకు తలపడ్డారు. ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు. తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే, సుగ్రీవుని బలము క్షీణించసాగింది. కాని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. రాముని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

వాలి సుగ్రీవులు కొమ్మలతోనూ, రాళ్లతోనూ, చెట్లతోనూ, గోళ్లతోనూ, పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరి దేహముల నుండి రక్తం కారుతూ ఉంది. వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు. సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు. వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. ధనుస్సును ఆకర్ణాంతము లాగి, వాలి మీదికి గురి చూచి, బాణమును వదిలాడు. రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది. ఆ బాణము దెబ్బతిన్న వాలి, పక్షిమాదిరి నేలకూలాడు. ఆ రోజు ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి. ఆరోజు వాలి నేలకూలాడు.

వాలికి క్రమ క్రమంగా స్పృహ తప్పుతూ ఉంది. గొంతులో గుర గుర శబ్దం వస్తూ ఉంది. వాలి యుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)