శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునైదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 15)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
పదునైదవ సర్గ
వాలి అంతఃపురంలో తన భార్య వద్ద ఉన్నాడు. ఇంతలో సుగ్రీవుని అరుపులు గావు కేకలు వినిపించాయి. దిగ్గున లేచాడు వాలి. సేవించిన మద్యం మత్తు దిగిపోయింది. కోపం వచ్చింది. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అంత: పురము నుండి బయటకు వచ్చాడు. వాలి వెంట ఆయన భార్య తార కూడా వచ్చింది. వాలిని వారించింది. వాలిని ప్రేమతో కౌగలించుకొని ఇలా చెప్పింది.“నాధా! నీకు అకాల కోపము పనికి రాదు. కోపము వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచించు. ఇప్పుడే యుద్ధం చెయ్యాలా. రేపు చెయ్యవచ్చు కదా! నీ శత్రువు ఎక్కడకు పోడుకదా! పైగా యుద్ధానికి వచ్చింది ఒక్కడే కానీ పదిమంది కాదుకదా! నీవు పరాక్రమము లేని వాడవు, దుర్బలుడవు కాదు కదా! అయినా నీవు అకాలంలో యుద్ధమునకు పోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దానికి
కారణం చెబుతాను విను.
కారణం చెబుతాను విను.
ఇంతకు ముందే నీవు నీ తమ్ముని సుగ్రీవుని యుద్ధంలో ఓడించావు. చావగొట్టి పంపించావు. చావు తప్పి పారిపోయాడు సుగ్రీవుడు. కాని వెంటనే యుద్ధానికి వచ్చాడు. ఈ కొద్దికాలంలో అతని బలం ఎలా పెరిగింది. ఆలోచించు. ఇంత కొద్దికాలంలో అతను నీ కన్నా బలవంతుడు అయ్యాడంటే నాకు నమ్మకం కుదరం లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. సుగ్రీవునికి బయట నుండి సాయం అందుతూ ఉంది. ఆ సాయం ఎవరు, ఏ రూపంలో చేస్తున్నారో తెలియదు. ఇంతకూ సుగ్రీవునికి సాయం చేసే వాళ్లు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? సుగ్రీవునికి సాయం చెయ్యాల్సిన అవసరం వారికి ఏముంది? బయట నుండి సాయం లేకుండా సుగ్రీవుడు ఇంతధైర్యంగా మరలా నీ మీదికి యుద్ధానికి కాలు దువ్వడు.
సుగ్రీవుడు బలవంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు. నేర్పు కలవాడు. తనకు ఏ లాభమూ లేకుండా ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో స్నేహం చేసాడో తెలుసుకోవడం అవసరం కదా! ఇటీవల మీ కుమారుడు అంగదుడు నాకు ఒక వార్త చెప్పాడు. దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను. మన సరిహద్దుల్లో కాపలా ఉండే గూఢచారులు అంగదునికి ఈ వార్త చెప్పారట.
అదేమిటంటే ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు, దశరథుని కుమారులు, రామ లక్ష్మణులు అనే పేరు గల వాళ్లు మన వనములో సంచరిస్తూ ఉన్నారట. వారితో సుగ్రీవునికి స్నేహం కలిసిందట. వారు సుగ్రీవుని కోరిక తీర్చడానికి ఒప్పుకున్నారట. ఇంక ఆ రాముడు ధనుస్సును ప్రయోగించడంలో గొప్ప నేర్పరి. బాణములను వేగంగా వేయగలడు. ఆ రాముడు ధర్మపరుడు. ఆపదలలో ఉన్నవారిని కాపాడే గుణం కలవాడు. మంచి లౌకిక జ్ఞానము శాస్త్రజ్ఞానము కలవాడు. తండ్రి ఆజ్ఞను పాలించేవాడు. రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం అని తెలిసింది.
అటువంటి వాడు ఇప్పుడు నీ సోదరుడు సుగ్రీవునికి సాయం చేస్తున్నాడట. కాబట్టి రామునితో నీకు విరోధము తగదు అని నా భావన. నీవు నా మీద కోపం తెచ్చుకోకపోతే నీకు ఒక విషయం చెబుతాను. సావధానంగా విను. నీకు తెలుసు. సుగ్రీవుడు ఏ తప్పూ చేయలేదు. కాబట్టి నీ తమ్ముని ఆదరించు. అతని రాజ్యము అతనికి ఇవ్వు. సుగ్రీవునితో విరోధము మాను. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకుంటే, రాముడు కూడా నీకు స్నేహితుడు అవుతాడు.
నాధా! సుగ్రీవుడు పరాయివాడు కాదు కదా! నీకు స్వంత తమ్ముడు. అతని మీద ప్రేమ చూపించాలి గానీ ద్వేషించకూడదు. ప్రస్తుతము నీకు నీ సోదరుడు సుగ్రీవునితో సంధి చేసుకొనడం తప్ప వేరు మార్గము లేదు. నేను నీ హితము కోరి ఈ మాటలు చెబుతున్నాను. నీవు నా భర్త కాబట్టి, నీ క్షేమమును నేను సదా కోరుతాను కాబట్టి చెబుతున్నాను. కోపము, ద్వేషము విడిచి పెట్టు. నా మాటవిను. సుగ్రీవునితో యుద్ధము మాను. " అని తార తన భర్త వాలికి హితోపదేశము చేసింది. కాని తార మాటలు వాలికి రుచించలేదు.
శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment