శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - పదునాల్గవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 14)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

పదునాల్గవ సర్గ

అందరూ కిష్కింధా నగరము ప్రవేశించారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.“రామా! ఇదే కిష్కింధా నగరము. ఇక్కడ ద్వారములు అన్నీ బంగారంతో నిర్మించారు. ఇక్కడ అనేక
యంత్రములు అమర్చబడ్డాయి. వాలిని చంపడానికి తగిన కాలము సమీపించింది. నీవు దానిని సఫలం చేస్తావని ఆశిస్తున్నాను.” అని అనుమానంగా అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుని మనసులోని సందేహాన్ని గ్రహించాడు రాముడు. అతని మనసులోని సందేహ నివృత్తి కోసరం ఇలా అన్నాడు.

“సుగ్రీవా! ఈ సారి వాలిని గుర్తు పట్టడంలో పొరపాటు జరగదు. ఎందుకంటే నీ మెడలో ఉన్న గజమాల నువ్వు సుగ్రీవుడు అని తెలియజేస్తుంది. ఒకే ఒక బాణంతో నేను వాలిని చంపుతాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈ సారి వాలి నా కంటబడి తప్పించుకుంటే, నువ్వు నన్ను తప్పు పట్టు. నన్ను నిందించు. నీ ఎదురుగానే కదా నేను ఏడు సాలవృక్షములను ఛేధించాను. ఈ వాలిని చంపడం పెద్ద కష్టమేమీ కాదు. నన్ను నమ్ము. నేను ఎన్ని కష్టములలో ఉన్నా ఎప్పుడూ అసత్యము
చెప్పలేదు. ఇక మీదట కూడా అసత్యము చెప్పను. చెప్పలేను. నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. ఇది సత్యము. నీలోని భయాన్ని వదిలిపెట్టు. ధైర్యంగా వాలితో యుద్ధం చెయ్యి. వాలిని యుద్ధానికి పిలువు. అతడు బయటకు వచ్చేట్టు చెయ్యి. నీవు యుద్ధమునకు పిలవగానే వాలి బయటకు వస్తాడు. ఎందుకంటే అతడు ఇప్పటి దాకా ఓటమి ఎరుగడు అని నువ్వే చెప్పావు కదా!

అతనికి తన బలము మీద పరాక్రమము మీద నమ్మకము ఎక్కువ. తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. కాబట్టి నీతో యుద్ధానికి వస్తాడు. నా చేతిలో చస్తాడు. మరొక విషయం. అతను ఇప్పుడు స్త్రీలతో కామభోగములు అనుభవిస్తూ ఉంటాడు. స్త్రీల మధ్య ఉన్న వాలి తనను ఎవడైనా ఎదిరిస్తే సహించలేడు. వెంటనే బయటకు వస్తాడు. కాబట్టి సుగ్రీవా! వాలిని యుద్ధానికి పిలువు." అని అన్నాడు రాముడు. 

సుగ్రీవునికి ధైర్యం చెబుతూ రాముడు పలికిన ధైర్యవచనాలకు సుగ్రీవుడు పొంగిపోయాడు. గట్టిగా గర్జించాడు. తొడ చరిచి వాలిని యుద్ధానికి పిలుస్తూ పెద్ద పెద్దగా రంకెలు వేసాడు. సుగ్రీవుడు అరుస్తున్న అరుపులకు, వేస్తున్న రంకెలకు, కిష్కింధ అదిరిపోయింది. వాలి బయటకు వచ్చేవరకూ సుగ్రీవుడు అలా అరుస్తూనే ఉన్నాడు. 

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)