శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబదియవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 50)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఏబదియవ సర్గ
హనుమంతుడు, తారుడు, అంగదుడు తమ తమ వానర సమూహములతో కలిసి వింధ్య పర్వత గుహలను వెదుకు తున్నారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైన్దుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, తారుడు, జట్టు జట్టుగా విడిపోయి ఆ పర్వత గుహలను వెదుకు తున్నారు.అలా వెదుకుతూ వారు ఒక దానవునిచేత రక్షింపబడుతున్న ఋక్షబిలము అనే గుహను చూచారు. అప్పటికే వారికి బాగా ఆకలిగా, దాహం వేస్తూ ఉంది. ఎక్కడా నీటి చుక్క దొరకలేదు. ఆహారము దరిదాపుల్లో దొరకడం లేదు. ఆ సమయంలో నీటిలో స్నానం చేసి ఒళ్లంతా తడి తడిగా నీళ్లు కారుతున్న చక్రవాక పక్షులు ఆ గుహలో నుండి బయటకు ఎగురుతూ రావడం వారికి కనిపించింది.. వారు ఆ బిలములోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని వారికి ఎటునుండి వెళ్లాలో తెలియడం లేదు. ఆ బిలమునకు ద్వారము కనిపించలేదు.
అప్పుడు హనుమంతుడు మిగిలిన వానరవీరులతో ఇలా అన్నాడు. “మనము అందరమూ సీత కోసం వెదికి వెదికి అలసిపోయినాము. కాని సీత జాడ తెలియలేదు. ఇక్కడ వృక్షములు పచ్చగా ఉన్నాయి. నీటిలో తడిసిన పక్షులు బయటకు వస్తున్నాయి. ఈ బిలము లోపల నీటి సరోవరము ఉండవచ్చును. మనము ఈ బిలము లోనికి ప్రవేశించి మన దాహము తీర్చుకుందాము."అని అన్నాడు. హనుమంతుని మాట విని అందరూ దారీ తెన్నూ లేని, ఆ బిలము లోనికి అతి కష్టం మీద ప్రవేశించారు. లోపల అంతా చీకటిగా ఉంది. ఒకరిని ఒకరు పట్టుకుంటూ, ఆ గుహలో వారు ఒక యోజన దూరము వెళ్లారు. కాని వారికి జలాశయము కనిపించలేదు. నిరాశ చెందారు.
ఆ సమయంలో వారికి ఒక వెలుగు కనిపించింది. వారు ఆ వెలుగు కనిపించిన చోటికి వెళ్లారు. వారికి బంగారము వలె ప్రకాశించు చున్న వృక్షములు, పుష్పించిన లతలు కనపడ్డాయి. అక్కడ రత్నములతో అలంకరింప బడిన వేదికలు ఉన్నాయి. అక్కడ పద్మములతో నిండి ఉన్న సరోవరము కనపడింది. ఆ వానరులు చుట్టు చూచారు. అక్కడ బంగారముతో నిర్మింపబడిన గృహములు, కనపడ్డాయి. ఫలపుష్పములతో నిండి ఉన్న చెట్లు ఆ ఇళ్ల చుట్టు ఉన్నాయి. ఆ ఇళ్లలో తినడానికి మధురమైన పదార్ధములు, పానీయములు అమర్చబడి ఉన్నాయి. బంగారు నాణెములు రాసులు రాసులుగా పోసి ఉన్నాయి. ఆ వానరులు ఇవి అన్నీ చూచి ఆశ్చర్య పోయారు.
అక్కడ ఎవరన్నా ఉన్నారా అని ఆ వానరులు వెదుకుతుంటే వారికి ఒక స్త్రీ కనపడింది. ఆమె నార చీరలు ధరించి, జింక చర్మము మీద కూర్చుని ఉంది. ఆమె దివ్యమైన తేజంతో ప్రకాశిస్తూ ఉంది. వానరులందరూ ఆమె చుట్టు నిలబడ్డారు. అప్పుడు హనుమంతుడు ఆమెను చూచి ఆమెకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఈ బిలము ఎవరిది? ఈ భవనములు, సంపదలు ఎవరివి?" అని అడిగాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఏబదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment