శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 49)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబది తొమ్మిదవ సర్గ
ఎంత వెతికినా సీత కనపడలేదని వానరులందరూ దీనంగా ఆ చెట్టుకింద కూర్చున్నారు. అంగదుడు వారి వద్దకు పోయి వారికి ఉత్సాహకరమైన మాటలు చెప్పి వారిని మరలా సీతను వెదకడానికి సమాయత్తం చేసాడు.“వానర వీరులారా! మనము అందరమూ పర్వతములు, వనములు, కొండలు గుహలు అన్నీ వెదికాము. కానీ సీత జాడ కానీ, రావణుని నివాసము కానీ కనిపెట్టలేకపోయాము. మనము బయలు దేరి చాలా కాలము అయినది. సుగ్రీవుడు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. సీత జాడ తెలియలేదు. అసలే సుగ్రీవుడు చండశాసనుడు. చెప్పిన సమయానికి తిరిగా రాకపోతే మనకు మరణ దండన తప్పదు.
కాని మనము సుగ్రీవునికన్నా రామునికే ఎక్కువ భయపడాలి. ఎందుకంటే రాముడు సీతావియోగంతో దు:ఖిస్తున్నాడు. కాబట్టి దిగులు చెందకుండా వెదకండి. మనకు తప్పకుండా సీత జాడ దొరుకుతుంది. కార్యసిద్ధి కలగాలంటే నేర్పు, ఓర్పు, ఉత్సాహము ముఖ్యమైన లక్షణములు. కాబట్టి మనము రెట్టించిన ఉత్సాహముతో వెదుకుదాము. తప్పకుండా మనకు సీత జాడ లభిస్తుంది. నాకు తోచినది నేను చెప్పాను. తరువాత మీ ఇష్టము.” అని అన్నాడు. అంగదుడు.
అప్పటికే బాగా అలసిపోయి ఉన్న గంధమాదనుడు ఇలా అన్నాడు. “అంగదుడు బాగా చెప్పాడు. మనము ఈ శరీరంలో ఉన్నంతవరకూ సీతను గురించి వెదుకుదాము. వెదికిన చోటునే మరలా మరలా వెదుకుదాము." అని అన్నాడు.
వెంటనే వానరు లందరూ ఉత్సాహంతో లేచారు. నలుదిక్కులకు పోయి వెదకడం మొదలెట్టారు. కొంత మంది పర్వతములు ఎక్కారు. మరి కొంత మంది అరణ్యములలో వెదుకుతున్నారు. ఎంత వెదికినా సీత జాడ కనపడలేదు. కొంచెపు సేపు అలసట తీర్చుకొని మరలా వెదకడం మొదలెట్టారు.
హనుమంతుడు మొదలగు వానర వీరులు పర్వత గుహలలో వెదకడం ఆరంభించారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment