శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 48)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబది ఎనిమిదవ సర్గ
అందరూ అన్ని దిక్కులకు వెళితే అంగదుని నాయకత్వంలో హనుమంతుడు మొదలగు వానర వీరులు దక్షిణదిక్కుగా బయలు దేరారు. వారి వెదకడం వింధ్యపర్వతముల వద్దనుండి మొదలయింది. వానర వీరులందరూ వింధ్యపర్వతముల మీద ఉన్న శిఖరములను, గుహలను, అరణ్యములను, నదులను, సరోవరములను అన్నింటినీ వెతికారు. కాని సీత జాడ కనపడలేదు. కాని వారు తమ పట్టుదల వీడలేదు. అలా వెదుకుతూనే ఉన్నారు. ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు మారుతూ వెతుకుతున్నారు.ఆ ప్రకారంగా వెతుకుతుంటే ఒక చోట చెట్లకు పండ్లు కానీ కాయలు కానీ లేవు. అక్కడ ఏ విధమైన జంతువులు లేవు. నిర్మానుష్యంగా ఉంది. సందడి లేదు. జంతువుల అరుపులు వినిపించడం లేదు. పూల మొక్కలు లేవు. ఓషధీ లతలు లేవు. సరోవరములు లేవు. నీరు లేదు.
కాని అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఆయన పేరు కండు మహర్షి. ఆయన నిత్యసత్యవ్రతుడు. ధర్మ తత్పరుడు. ఆయన కుమారుడు, పది సంవత్సరముల బాలుడు, ఆ అరణ్యములో మరణించాడు. కండు మహర్షికి కోపం వచ్చింది. ఆ అరణ్యము మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, వృక్షములకు కానీ జీవించడానికి యోగ్యము కాకుండా శపించాడు.
అటువంటి ప్రదేశములోకి ప్రవేశించారు వానర వీరులు. అక్కడ కూడా వెతుకుతున్నారు. సీత కానీ, సీతను అపహరించిన రావణుడు కానీ కనపడలేదు. కాని వారికి ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు పర్వతము మాదిరి ఆకారము కలవాడు. భయంకరంగా ఉన్నాడు. వాడితో యుద్ధం చేయడానికి వానర వీరులు సన్నద్ధం అయ్యారు. తన మీదికి వస్తున్న వానరులను చూచి ఆ రాక్షసుడికి కోపం వచ్చింది.
“ఈ రోజు మీరందరూ నా చేతిలో చచ్చారు" అంటూ తన పిడికిలి పైకెత్తి వారి వెంట పడ్డాడు.
“అమ్మయ్య వీడే రావణుడు" అని అనుకున్నారు.
వాలి కుమారుడు అయిన అంగదుడు ఆ రాక్షసుడిని తన చేతితో చాచి ఒక దెబ్బ కొట్టాడు. అంగదుడి దెబ్బకు మొహం నుండి ముక్కుల నుండి రక్తం కారింది. వాడు కొండమాదిరి కిందపడ్డాడు. చచ్చాడు.
రావణుడు చచ్చాడు కాబట్టి సీతను అక్కడే దాచి ఉంటాడు అని అనుకొని వానరులందరూ వాడు ఉన్న గుహను అంతా వెతికారు. వారికి సీత కనపడలేదు. పక్కనే ఉన్న మరొక గుహలోకి ప్రవేశించారు.
ఆ గుహలో కూడా వెదికారు కానీ వారికి సీత కనపడలేదు. అలసి పోయారు. వారందరూ గుహ నుండి బయటకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment