శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 51)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ఏబది ఒకటవ సర్గ

హనుమంతుడు ఆ తాపసితో ఇంకా ఇలా అన్నాడు.

"మాతా! మేము ప్రస్తుతము ఆకలి దప్పులతో బాధ పడుతున్నాము. ఈ బిలములో చీకటిలో యోజన దూరం నడిచాము. అందరమూ బాగా అలసిపోయి ఉన్నాము. ఈ బిలములో జలము దొరుకుతుందని ఆశతో వచ్చాము. కాని ఇక్కడ ఇన్ని పదార్థములను చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. ఈ బంగారు గృహములు. ఈ వృక్షములు ఎవరివి? ఎలా పుట్టాయి. మీరే సృష్టించారా! లేక మరి ఎవ్వరి తపోబలము వలన ఉద్భవించాయా! మాకు ఏమీ అర్థం కావడం లేదు. మాకు వివరంగా చెప్పండి" అని వినయంగా అడిగాడు హనుమంతుడు.

హనుమంతుని మాటలు విన్న ఆ తాపసి హనుమంతునితో ఇలా చెప్పింది. “ఓ వానరములలో గొప్పవాడా! మయుడు అనే దానవుడు ఉన్నాడు. అతనికి అన్ని మాయలు తెలుసు. ఆ మయుడు పూర్వము దానవులకు శిల్పిగా ఉండేవాడు. ఈ భవనములను ఆయనే నిర్మించాడు. ఆ మయుడు ఈ గుహలో వేలకొలది సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి, ఆయన వలన వరములను పొందాడు. ఆ మయుడు ఇక్కడ ఈ భవనములను నిర్మించుకొని ఇక్కడే సుఖంగా కాలం గడిపాడు.

ఆ మయుడు హేమ అనే దేవ కన్య ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆ మయుని చంపాడు. మయుడు మరణించిన తరువాత బ్రహ్మ దేవుడు ఆ మయునికి చెందిన ఈ గృహములను, సంపదలను దేవ కన్య హేమకు ఇచ్చాడు. ఇంక నా పేరు స్వయంప్రభ. నా తండ్రి మేరుసావర్ణుడు. దేవకన్య హేమ నాకు మంచి స్నేహితురాలు. ఆమె ఆదేశము ప్రకారము ప్రస్తుతము నేను ఈ భవనములను, సంపదలను కాపాడుతున్నాను.

ఇంతకూ మీరు ఎవరు? ఏ పనిమీద ఈ వింధ్యపర్వత ప్రాంతములకు వచ్చారు? ఈ అడవులలో ఎందుకు, ఎవరి కోసరం తిరుగుతున్నారు? ఇక్కడకు ఎలా వచ్చారు?

ఇవన్నీ తరువాత చెబుదురు కానీ మీరంతా మంచి ఆకలి, దప్పికతో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్న ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని, మధురమైన పానీయములను తాగి సేదతీరండి. తరువాత మీ గురించి నాకు చెప్పండి." అని ఆ తాపసి చెప్పింది.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఏబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)