శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 52)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ఏబది రెండవ సర్గ
ఆ తాపసి అనుమతి పొందిన ఆ వానరులు అక్కడ ఉన్న మధురమైన ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని, మధురమైన పానీయములను సేవించి భుక్తాయాసంతో పడుకున్నారు. తాపసి తమను అడిగిన విషయం మర్చిపోయారు.అది చూచి ఆ తాససి స్వయంప్రభ వారి దగ్గరకు వచ్చి “మీ ఆకలి తీరినదా! విశ్రాంతి తీసుకున్నారా! ఇప్పుడైనా మీ గురించి నాకు చెబుతారా!" అని అడిగింది. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో తమ గురించి చెప్పసాగాడు.
“ఓ మాతా! నా పేరు హనుమంతుడు. మాది కిష్కింధ. వీరంతా నా సహచరులు. మేము వానరులము. అయోధ్యను పరిపాలించు మహారాజు దశరథుని కుమారుడు రాముడు. ఆయన తన భార్య సీతతో వనవాసము చేస్తున్నాడు. దండకారణ్యములో, జనస్థానములో, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయమున, రావణుడు అనే రాక్షసుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. రాముడు మా వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సీతను వెతికిపెట్టమని సుగ్రీవుని అడిగాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞమేరకు, వాలి కుమారుడు అంగదుని నాయకత్వంలో, అగస్త్యుడు సంచరించిన ఈ దక్షిణ దిక్కున మేము సీతకోసరం, రావణుని కోసరం వెదుకు తున్నాము. అలా వెదుకుతుంటే మాకు ఆకలి దప్పిక వేసాయి. ఈ గుహలో నుండి నీటితో తడిసిన పక్షులు రావడం చూచి, ఈ గుహలో నీరు ఉండవచ్చని తెలిసి ఈ గుహలో ప్రవేశించాము. నిన్ను చూచాము. నీ వలన మాకు ఆకలి దప్పిక తీరాయి. ఆకలితో మరణించబోవుచున్న మమ్ములను ఆహారము ఇచ్చి కాపాడావు. మేము నీకు ఏమి ప్రత్యుపకారము చేయగలము." అని అడిగాడు హనుమంతుడు.
హనుమంతుని యుక్తియుక్తములైన మాటలు విన్న ఆ స్వయంప్రభ ఇలా పలికింది. “నేను తాపసిని. మీ వలన నాకు కావాల్సిన ఉపకారము ఏమీ లేదు. మీకు ఆకలి తీరింది అంతే చాలు.” అని పలికింది స్వయంప్రభ.
అప్పుడు హనుమంతుడు ఆమెతో ఇలా అన్నాడు. “మాతా! మీరు ధర్మమూర్తులు. మా రాజు సుగ్రీవుడు మాకు ఇచ్చిన గడువు మేము ఈ బిలములో దిక్కుతోచకుండా తిరగడంలో గడిచిపోయింది. గడువు లోపల చెప్పిన పని పూర్తిచేయనందుకు, మారాజు సుగ్రీవుడు మాకు మరణ దండన విధిస్తాడు. మేము సీతాన్వేషణము అనే గొప్ప కార్యమును నిర్వర్తించవలసి ఉంది. కాని ఈ గుహలో చిక్కుకు పోవడం వల్ల ఆ పని చేయలేకపోయాము. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. మాకు ఆహారం ఇచ్చి కాపాడావు. ఈ ఆపదనుంచి కూడా నువ్వే మమ్ములను కాపాడాలి." అని అన్నాడు హనుమంతుడు.
హనుమంతుని మాటలకు ఆ తాపసి నవ్వి ఇలా పలికింది.
“ఈ బిలములో ప్రవేశించిన వాడు ప్రాణాలతో బయటకు వెళ్లలేడు. మీరంతా కళ్లుమూసుకోండి. నేను నా తప:ప్రభావంతో మిమ్ములను ఈ బిలము దాటిస్తాను. కళ్లు తెరిస్తే మాత్రం మీరు ఈ బిలము దాటలేరు.” అని చెప్పింది.
ఆ వానరులందరూ గబగబా తమ చేతులతో తమ కళ్లను గట్టిగా మూసుకున్నారు. స్వయంప్రభ తన తపోబలంతో ఆ వానరులను బిలము బయటకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ తాపసి ఆ వానరులతో ఇలా అంది. "మీరు ఉన్నది వింధ్యపర్వతము. అది ప్రస్రవణ పర్వతము. అది మహాసముద్రము. ఇంక నేను నా స్వస్థానమునకు వెళ్ళెదను.” అని పలికి స్వయంప్రభ తన బిలంలోకి వెళ్లిపోయింది.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ఏబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment