శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది మూడవ & నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 53)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ఏబది మూడవ సర్గ

అంగదుని సారధ్యంలో బయలు దేరిన వానర వీరులు అందరూ సాగర తీరం చేరుకున్నారు. వారందరికీ వింధ్యపర్వత బిలంలోనే సుగ్రీవుడు ఇచ్చిన ఒక నెల రోజులు గడువు తీరిపోయింది. తాపసి తపో మహిమ వల్ల సాగర తీరం చేరుకున్నారు. వారందరూ వింధ్యపర్వత ప్రాంతంలో కూర్చుని ఏమి చెయ్యాలో తోచక చింతిస్తున్నారు. పుష్పించిన లతలను చూచి వారు వసంత ఋతువు ప్రవేశించినది అని తెలుసుకున్నారు. తమకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసి పోయింది అని చింతిస్తున్నారు.

అప్పుడు అంగదుడు వారిని చూచి ఇలా అన్నాడు.

“మనము అందరము సీతను వెదకడానికి సుగ్రీవుని ఆజ్ఞ మేరకు బయలు దేరాము. మనకు ఇచ్చిన గడువు ఒక మాసం రోజులు. ఆ మాసం రోజులు మనము ఆ బిలంలో ఉండగానే గడిచిపోయింది. అది మీకు తెలుసు. మనం ఆశ్వయుజ మాసంలో బయలు దేరాము. ఇప్పుడు చైత్రము వచ్చింది. మీరంతా సుగ్రీవునికి విశ్వాస పాత్రులు. ధర్మం తెలిసిన వారు. నీతి మంతులు. ఇప్పటి దాకా మీరు చేపట్టిన కార్యములు అన్నింటిలోనూ మంచి ఫలితములను సాధించారు. సుగ్రీవుని ఆజ్ఞప్రకారము నేను మీకు నాయకుడు అయ్యానే గానీ, దిశానిర్దేశం చెయ్యడంలో మీరే సమర్ధులు. సుగ్రీవుని ఆజ్ఞ మీరినందుకు మనకు మరణం తప్పదు. కాబట్టి మనం అందరం మరణించవలసిందే. కిష్కింధకు పోయి మరణ దండన పొందే కంటే ఇక్కడే ప్రాయోపవేశం చేసి మరణించడం మంచిది.

సుగ్రీవుడు చాలా తీక్షణ స్వభావము కలవాడు. ఎట్టి పరిస్థితులలోనూ కాలాతిక్రమణ చేసిన మనలను క్షమించడు. సీత గురించిన వార్తను మనము తీసుకుని వెళ్లకుంటే మనకు మరణ దండన తప్పదు. కాబట్టి మనకు ప్రాయోపవేశమే ప్రస్తుత కర్తవ్యము. సుగ్రీవుని చేతిలో చిత్రహింసలు పడి మరణించేకంటే సుఖంగా ప్రాయోపవేశం చెయ్యడం మంచిది కదా!
మీరు ఇంకొక విషయం మరిచి పోతున్నారు. నేను వాలి కుమారుడను. సుగ్రీవునికి నా మీద లోలోపల కోపం ఉంది. రాముని ప్రోద్బలంతో సుగ్రీవుడు నన్ను యువరాజును చేసాడే కానీ, నా మీద ఉన్న ప్రేమతో చెయ్యలేదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను ఊరికే వదలడు. నా తండ్రి మీద ఉన్న తన కోపాన్ని, పగను ఇప్పుడు నా మీద చూపిస్తాడు. నాకు తీక్షణ మైన శిక్ష విధించి నన్ను చంపిస్తాడు. వాలి కుమారుడిగా బతికి, కిష్కింధలో దిక్కులేని చావు చచ్చేకంటే. ఇక్కడ పవిత్రమైన సముద్రతీరంలో ప్రాయోపవేశం చేసి మరణించడం మంచిది అని నా అభిప్రాయము." అని అన్నాడు అంగదుడు.

యువరాజైన అంగదుని మాటలు విని వానరులు ఇలా అన్నారు. “నీవు చెప్పింది నిజము. రాముడు సీతను చూడవలెనని కోరికతో ఉన్నాడు. రాముడి కోరిక తీర్చవలెనని సుగ్రీవుడు పట్టుబట్టి ఉన్నాడు. మనము సీత జాడ తెలుసుకోకుండా వెళితే మనకు దండన
తప్పదు. అదీ కాకుండా మనము గడువులోపల వెళ్లడం లేదు. సుగ్రీవుడు మనకు ఇచ్చిన గడువు ఎప్పుడో తీరిపోయింది. రాముడికి సంతోషము కలిగించాలనే మిషమీద సుగ్రీవుడు మనలను తీవ్రంగా దండిస్తాడు. చంపిస్తాడు. తప్పు చేసిన వాళ్లము ప్రభువు దగ్గరకుపోవడం మంచిది కాదు. మనము అందరం సుగ్రీవునికి మంత్రులము. ఆయనే మనలను ఈ కార్యము మీద పంపాడు. కాబట్టి మనము సీతను వెదికి ఆమె జాడ తెలుసుకొని వెళ్లాలి కానీ ఒట్టి చేతులతో వెళ్లకూడదు." అని అన్నారు. ఆ మాటలు విన్న తారుడు అనే వానరుడు ఇలా అన్నాడు. “మనము ఇక్కడే ఉంటే సుగ్రీవుని వలన భయం ఉండదు. ఈ లోపల మనము సుగ్రీవుని బారి నుండి మరణ దండన తప్పించుకొనే ఉపాయం ఆలోచించాలి." అని అన్నాడు. తారుని మాటలకు అంతా సంతోషించారు.

ఈ మాటలు విన్న హనుమంతుడు నిరాశతో నిస్పృహతో ఉన్న అంగదునికి కర్తవ్యబోధ చేయాలని అనుకున్నాడు. ముందు అంగదుని భేదోపాయముతో మిగిలిన వానరుల నుండి విడదీసి, తరువాత దండోపాయముతో బయపెట్టి, కిష్కింధకు తీసుకొని వెళ్లవలెనని అనుకున్నాడు. ఆ ప్రకారము అంగదునితో ఇలా అన్నాడు.

“ఓ అంగదా! నీవు వాలి పుత్రుడవు. యుద్ధం చేయడంలో నీ తండ్రి వాలి కంటే సమర్ధుడవు. ఈ వానర రాజ్యమును పాలించుటకు అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. కానీ ఈ వానరులకు ధైర్యము లేదు. చపలచిత్తులు. ఏదో మాట్లాడుతుంటారు. వీరికి తమ భార్యబిడ్డలను వదిలి వచ్చామే అని దిగులు. అందుకని ఏమేమో మాట్లాడుతున్నారు. వీరు నీ ఆజ్ఞలను పాటించరు. ఈ జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు నీతో కలవరు. నేను కూడా వారితోనే ఉంటాను. సుగ్రీవుడు మనము ఎక్కడ ఉన్నా మనలను వెదికి వెదికి చంపుతాడు. అప్పుడు నీవు ఎన్ని చెప్పినా సుగ్రీవుడు వినడు. బలవంతుడు బలము లేని వాడితో విరోధము పెట్టుకో వచ్చును కానీ బలహీనుడు బలవంతునితో వైరముపెట్టుకోరాడు. సుగ్రీవుని కంటే మనము దుర్బలులము. సుగ్రీవునితో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. మనము ఇక్కడే ఉంటే, మనలను లక్ష్మణుడు తన బాణములతో హతమారుస్తాడు. లక్షణుని వద్ద నారాచబాణములు అనేకం ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నా అవి మనలను చీలుస్తాయి.

ఈ వానరులందరూ తమ తమ భార్యా పిల్లలను తలచుకుంటూ నిన్ను వదిలేస్తారు. ఎవరి దోవన వారు వెళతారు. వీరు భయస్తులు. ఊరికే బయపడతారు. భయం మనసులో ప్రవేశిస్తే గడ్డిపరక కదిలినా భయంగానే ఉంటుంది. కాబట్టి భయాన్ని వదిలిపెట్టు. సుగ్రీవుని గురించి అనవసరంగా భయపడకు.

మనం అందరం సుగ్రీవుని వద్దకు వెళతాము. జరిగిన విషయాలు చెబుదాము. సుగ్రీవుడు అంత దుర్మార్గుడు కాదు. దయ కల వాడు. నీవు యువరాజువు. కాబోయే రాజువు. సుగ్రీవుడు ధర్మం తప్పి నడవడు. మంచి మనసు కలవాడు. సత్యవ్రతుడు. సుగ్రీవుడు నీకు అపకారం చెయ్యడు. పైగా సుగ్రీవునికి నీ తల్లి తార అంటే ఎంతో ప్రేమ అభిమానము. తార కోసరం ఏమైనా చేస్తాడు. పైగా సుగ్రీవునికి సంతానము లేదు. నీవు ఒక్కడివే సుగ్రీవుడికి వారసుడివి. కాబట్టి సుగ్రీవుని వలన నీకు వచ్చిన నష్టము ఏమీలేదు. మనం సుగ్రీవుని వద్దకు పోదాము.” అని హనుమంతుడు అన్నాడు.

శ్రీమద్రామాయణము
కిష్కిధా కాండము యాభయి మూడవ & నాలుగవ సర్గ సంపూర్ణము. 
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)