శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 55)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
యాభయి ఐదవ సర్గ
తన ప్రభువు సుగ్రీవునికి అనుకూలంగా, ధర్మసమ్మతంగా హనుమంతుడు మాట్లాడిన మాటలు విన్నాడు అంగదుడు. హనుమంతునితో ఇలా అన్నాడు.“హనుమా! సుగ్రీవుడు నీవు అనుకున్నంత మంచి వాడు కాదు. అతనిలో మంచితనము ఏకోశానా లేదు. అతని మనసు శుద్ధమైనది కాదు. అతనిలో ఋజువర్తన లేదు. కపటి. హనుమా! సుగ్రీవుడు నా తండ్రి దుందుభిని వెతుకుతూ బిలములోకి వెళితే ఆయన కోసరం వేచి ఉండక, బిలమును మూసి వేసి, రాజ్యమును హరించాడు. అంతే కాకుండా వాలి భార్య, నా తల్లి అయిన తారను కూడా భార్యగా స్వీకరించాడు. అటువంటి వాడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? అన్నభార్య తల్లి వంటిది కదా. అటువంటి అన్నభార్య తారను, అన్న బతికి ఉండగానే, భార్యగా స్వీకరించడం ధర్మమా!
అంతే కాదు. అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రామునితో మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు నా తండ్రి వాలిని చంపి సుగ్రీవునికి కిష్కింధకు రాజును చేసాడు. కాని సుగ్రీవుడు ఏం చేసాడు? చేసిన మేలు మరిచి, శరత్కాలము వచ్చినా, రాముని పని గురించి ఆలోచించలేదు. ఇటువంటి వాడు ఎవరు చేసిన ఉపకారమును గుర్తుంచుకుంటాడు.
హనుమా! శరదృతువువచ్చిన తరతువాత ఎంత కాలానికీ సుగ్రీవుడు రాకపోతే, లక్ష్మణుడు వచ్చి చంపుతానని బెదిరిస్తే, లక్ష్మణుని బాణాలకు భయపడి మనలను సీతను వెదకడానికి పంపాడే కానీ, ధర్మం అంటే భయం ఉండి కాదు. సుగ్రీవుడు అధర్మపరుడు, పాపాత్ముడు, చేసిన మేలు
మరిచేవాడు, చంచలస్వభావుడు. అటువంటి వాడిని ఎవరైనా నమ్ముతారా! ముఖ్యంగా వానరులు ఎవరూ సుగ్రీవుని నమ్మరు. నేను సుగ్రీవుని అన్న కొడుకును. తన కొడుక్కు రాజ్యం ఇవ్వకుండా నాకు రాజ్యం ఇస్తాడని నేను ఎలా అనుకోను. పైగా నేను తన శత్రువు కొడుకును. గుణవంతుడైనా గుణహీనుడైన స్వంత పుత్రుడే రాజు అవుతాడు కానీ, శత్రువు కొడుకును ఐన నేను రాజు ఎలా అవుతాను.
నేను సుగ్రీవుని చేతిలో చంపదగిన వాడిని కానీ రాజు కాదగినవాడిని కాను. పైగా నా వల్ల అపరాధము జరిగింది. నేను సుగ్రీవుడు ఇచ్చిన సమయము అతిక్రమించాను. ఒక వేళ సుగ్రీవుడు నన్ను క్షమించినా, కిష్కింధలో దుర్బలుడుగా జీవించలేను. క్రూరుడు, భ్రాతృఘాతకుడు అయిన సుగ్రీవుడు నన్ను రహస్యముగా బంధించి, చంపిస్తాడు. వాడి చేతిలో బంధింపబడి చావడం కంటే ఇక్కడే ప్రాయోపవేశము చెయ్యడం ఉత్తమం.
నేను ఇక్కడే ఉంటాను. కిష్కింధకు రాను. మీరంతా వెళ్లిపొండి. నేను ఇక్కడే మరణిస్తాను. మీరు కిష్కింధకు వెళితే, రామ లక్ష్మణులకు, సుగ్రీవునికి నా నమస్కారాలు చెప్పండి. నా తల్లి రుమను అడిగినట్టు చెప్పండి. నా తల్లి తారను ఓదార్చండి. నా తల్లి తారది జాలి గుండె. నేను మరణించాను అని తెలిస్తే తట్టుకోలేదు. తాను కూడా మరణిస్తుంది. " అని అన్నాడు అంగదుడు.
అంగదుని మాటలు విన్న వృద్ధ వానరులకు దు:ఖము ముంచుకొచ్చింది. మేము కూడా వెళ్లము. నీతో పాటు ఉంటాము అన్నారు. అందరూ నేల మీద దర్భలు పరుచుకొని ప్రాయోపవేశమునకు ఉపక్రమించారు. వానరులందరూ అంగదుని చుట్టుచేరి, సుగ్రీవుని తిడుతూ ప్రాయోపవేశము చెయ్యడానికి నిశ్చయించుకున్నారు.
సముద్రతీరంలో దర్భలు పరిచారు. తూర్పుముఖంగా కూర్చున్నారు. ఆచమనం చేసారు. రాముని గురించి మాట్లాడుకున్నారు. రాముడు అడవులకు రావడం, జనస్థానంలో ఉండగా రాముడు
రాక్షసులను చంపడం, రావణుడు సీతను అపహరించడం, జటాయువు చావడం, సుగ్రీవునితో స్నేహం, వాలి మరణం ఇవన్నీ తలచుకుంటున్నారు. అందరూ ఆ దర్భాసనముల మీద పడుకున్నారు.
రాక్షసులను చంపడం, రావణుడు సీతను అపహరించడం, జటాయువు చావడం, సుగ్రీవునితో స్నేహం, వాలి మరణం ఇవన్నీ తలచుకుంటున్నారు. అందరూ ఆ దర్భాసనముల మీద పడుకున్నారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment