శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 46)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

నలుబది ఆరవ సర్గ

సుగ్రీవుడు వానర వీరులతో చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు రాముడు. రామునికి ఒక సందేహం కలిగింది. కిష్కింధలో ఉన్న సుగ్రీవునికి భూమండలం గురించిన ఇంతటి పరిజ్ఞానము ఎలా కలిగింది అని విస్మయం కలిగింది. సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.

“మిత్రమా! నీవు వానర నాయకులతో వారు ఎక్కడెక్కడ వెదకాలి అన్న విషయాన్ని ఎంతో విపులంగా చెప్పావు కదా! నీకు ఈ భూమండలం లోని వివిధ ప్రదేశాల గురించి ఎలా తెలుసు?" అని అడిగాడు.

సుగ్రీవుడు ఇలా చెప్పసాగాడు. “రామా! ఇదివరకు నీకు వాలి, దుందుభి సంగతి చెప్పాను కదా. మహిష రూపములో వచ్చిన దుందుభి అనే దానవుని తరుముతూ నా అన్న వాలి వెళ్లాడు. దుందుభి మలయపర్వతము గుహలో ప్రవేశించాడు. వాలి కూడా దుందుభిని తరుముతూ ఆ గుహలో ప్రవేశించాడు. నేను గుహద్వారము వద్ద నా అన్న వాలి కోసరము వేచి ఉన్నాను.
ఒక సంవత్సరము గడిచిపోయినది. వాలి బయటకు రాలేదు. కాని ఆ గుహ లో నుండి రక్తము ప్రవాహంలాగా ప్రవహిం చింది. ఆ దుందుభి నా అన్న వాలిని చంపేసాడు అని దుఃఖించాను. నాకు ఆ దుందుభి మీద కోపం వచ్చింది. నా అన్న వాలిని చంపిన వాడు బయటకు రాకూడదు. ఆ గుహలోనే చావాలి అనే ఉద్దేశంతో ఆ గుహ ముఖద్వారమును రాళ్లతోనూ బండలతోనూ మూసివేసాను.

నేను కిష్కింధకు తిరిగి వచ్చాను. వాలి లేడు కాబట్టి వాలి భార్య తారను, నా భార్య రుమను, వాలి రాజ్యమును యధేచ్ఛగా అనుభవిస్తున్నాను. కొన్నాళ్లకు వాలి తిరిగి వచ్చాడు. నాకు భయం వేసింది. నేను సింహాసనము నుండి లేచి వాలికి నమస్కరించి వాలి సింహాసనమును వాలికి తిరిగి ఇచ్చివేసాను. కాని వాలి నా మీద కోపగించాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను నా మంత్రులతో సహా పారిపోయాను. వాలి నన్ను వెంబడించాడు. నేను పరుగెడుతున్నాను. వాలి నన్ను తరుముతున్నాడు.

నేను అనేక నదులు, పర్వతములు, అరణ్యములు దాటి పరుగెడు తున్నాను. నాలుగు దిక్కులు పరుగెత్తాను. భూమండలము మొత్తము చుట్టేసాను. తూర్పుదిక్కున ఉదయ పర్వతము వరకు పరుగెత్తాను. క్షీర సాగరమును చూచాను. తరువాత దక్షిణదిక్కుగా పరుగెత్తాను. వింధ్య పర్వతములు దాటి పరుగెత్తాను. అక్కడి నుండి పడమటి దిక్కుకు, అక్కడి నుండి ఉత్తర దిక్కుకు పరుగెత్తాను. మేరు పర్వతమును దాటి ఉత్తర సముద్రమును చేరుకున్నాను. నా వెంట నా మంత్రులు కూడా పరుగెడుతున్నారు. నా మంత్రి హనుమంతుడు నన్ను చూచి ఇలా అన్నాడు.

“రాజా! ఇలా ఎంత కాలము పరుగెడతారు. మనము ఒక సురక్షితమైన ప్రదేశమును చేరుకోవాలి. నాకు ఇప్పుడే జ్ఞాపకము వచ్చింది. మతంగ మహా ముని వాలికి శాపం ఇచ్చాడు. వాలి మతంగ ముని ఆశ్రమ ప్రాంతములలో ప్రవేశిస్తే, అతను మరణిస్తాడు. ఆ మతంగ ముని ఆశ్రమ ప్రాంతము మనకు సురక్షిత ప్రాంతము. మనము అక్కడకు పోదాము." అని అన్నాడు.

హనుమంతుని మాట ప్రకారము మేమందరమూ ఋష్యమూక పర్వత ప్రాంతము చేరుకున్నాము. అక్కడే మతంగ ముని ఆశ్రమము ఉంది. వాలి నన్ను తరుముతూ ఋష్యమూక పర్వతము వరకూ వచ్చి, భయపడి వెనుదిరిగి పోయాడు. ఆ సందర్భములో నేను ఈ భూమండలము అంతా తిరిగి చూచాను. అందువలన నాకు అన్ని ప్రదేశములు అన్నీ తెలుసు." అని అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు పడ్డ బాధలకు రామునికి సంతోషమూ, దు:ఖము రెండూ కలిగాయి.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)