శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 76)
శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది ఆరవ సర్గ అప్పటి వరకూ శ్రీ రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేక పోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు. “పరశురామా! మీ గురించి విన్నాను. నీవు తండ్రి ఋణమును తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టు బెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు.” అని పలికి పరశు రాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. పరశురాముని చూచి ఇలా అన్నాడు. “ఓ పరశురామా! మీరు బ్రాహ్మణులు. నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధాకారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింప వలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆశక్తి మీద ప్రయోగింపనా. లేక నీవు ఇప్పటి...