శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 63)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై మూడవ సర్గ

విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు.
విశ్వామిత్రుని చూచి బ్రహ్మ “ఓ విశ్వామిత్రా! నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు." అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు.

కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వసిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి.

ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్లాడు. " ఓ అప్సరసా! నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మధబాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు."అని వేడుకున్నాడు.

విశ్వామిత్రుని కోరికను మన్నిచింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు.

అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడా గడా వణికి పోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేసాడు.

తరువాత హిమాలయ పర్వతములకు వెళ్లాడు. ఇంద్రియము లను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరములో తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ ప్రకారంగా వేయి సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడి పారిపోయారు.

దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకొని విశ్వామితుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. “ ఓ విశ్వామిత్రా! నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహా ఋషికి అయ్యావు. ఓ విశ్వామిత్రా! నీవు మహర్షివి." అని అన్నాడు.
కాని విశ్వామిత్రునికి సంతోషము కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు.

“ఓ బ్రహ్మదేవా! నాకు మహర్షి పదవి లభించినది అనే మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను (అనగా ఇంద్రియములను జయించినవాడు) అయ్యానా!" అని అడిగాడు.
ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి “నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలి." అని అన్నాడు.

తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

ఈ సారి చేతులుపైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సుచేయడం మొదలెట్టాడు. విశ్వామిత్రుడు ఎండా కాలంలో ఐదు అగ్నుల మధ్య, వర్షాకాలములో ఆరుబయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి, వేయి సంవత్సరములు తపస్సుచేసాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సుచూచి దేవేంద్రునకు దేవతలకు భయం పట్టుకుంది.

దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)