శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 73)

శ్రీమద్రామాయణము

బాలకాండ

డెబ్బది మూడవ సర్గ

దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.
(భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు).

కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు.
“బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను." అని అన్నాడు యుధాజిత్తు.

దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాతఃకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు.
పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభ ముహూర్తంలో తోరము కట్టడం మొదలగు మంగళ కార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు, అందరూ దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వసిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలాఅన్నాడు.

“ఓ జనక మహారాజా! దశరథమహారాజు తన కుమారులకు కౌతుక మంగళకార్యములను పూర్తిచేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలికదా! " అని అన్నాడు.

“అదేమిటి మహర్షీ! మిథిల కూడా వారిదే కదా! వారికి అడ్డేమున్నది. వారు నా అనుమతి కోసరం ఎదురు చూడ్డం ఏమిటి? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తిచేసుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంక ఆలస్యము చేయకుండా దశరథులు వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రండు." అని అన్నాడు జనకుడు.

జనకుని మాట మేరకు దశరథుడు, తనకుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారి నందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వసిష్ఠుని చూచి ఇలా అన్నాడు.

“ఓ వసిష్ఠ మహర్షీ! తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యము వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను.” అని అన్నాడు.

ఆ మాటలకు వసిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుని, శతానందుని చెరి ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.

వివాహ మండపము మధ్యలో ఉన్న అగ్ని కుండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హోమగుండము చుట్టు గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హెూమము చేయు సాధనములు, నేతితో నిండినపాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వసిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రము చుట్టూ పరిచాడు. వేద మంత్రములను పఠిస్తూ హెూమ కార్యక్రమమును నిర్వర్తించాడు.

తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముని చూచి ఇలా అన్నాడు.

"ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ, ప్రతీఛ్ఛ చైనాం భద్రం తే పాణిం గృష్ణాష్వ పాణినా॥"

“ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణము చేయుము. ఓరామా! ఈమె పతివ్రతయై నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు." అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. కన్యాదానం చేసాడు.

ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు.

తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు. "లక్ష్మణా! ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము. ఇంక ఆలస్యము చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు." అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు.

తరువాత జనకుడు భరతుని చూచి " ఓ భరతా! ఈమె నా కుమార్తె మాండవి. ఈమెను పాణిగ్రహణము గావించు."

ఓ శత్రుఘ్నా! ఈమె నా కుమార్తె శ్రుత కీర్తి. నీవు ఈమె పాణిని గ్రహించు.

ఓ రామ,లక్ష్మణ,భరత, శత్రుఘ్నులారా! మీరందరూ సౌమ్యులు. గుణవంతులు. మంచి ప్రవర్తన కలవారు. నాకుమార్తెలను మీ మీ భార్యలుగా స్వీకరించండి.” అని అన్నాడు.

అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవము జరిగిపోయింది. 

దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమ స్కారము చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారము చేసారు. తరువాత పురోహితులు వసిష్ఠమహర్షికి నమస్కారము చేసారు. తరువాత వసిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమమును వైభవోపేతంగా జరిపించాడు.

తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టు మూడు సార్లు ప్రదక్షిణము చేసారు. ఆ ప్రకారంగా సీతా రాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.

వివాహ కార్యక్రమము తరువాత రామ లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిదిగృహమునకు వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది మూడవ సర్గ సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)