శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 52)

శ్రీమద్రామాయణము

బాలకాండ

యాభై రెండవ సర్గ

విశ్వామిత్రుడు వసిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేసాడు. వసిష్ఠమహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానిం చాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు.

అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని ఇలా అడిగాడు. “ఓ మహర్షీ! మీకు మీ శిష్యులకు క్షేమమే కదా! మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా! మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా! " అని అడిగాడు.

“విశ్వామిత్ర మహారాజా! తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారా! మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా! రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా! నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా! నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా! నీవు శత్రుసంహారము చేసి, శాంతి స్థాపన చేసావు కదా! ఓ విశ్వామిత్రా! నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా! " అని కుశల ప్రశ్నలు అడిగాడు వసిష్ఠుడు.

వసిష్ఠుడు అడిగిన దానికి “ఓ మహర్షీ! తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరమూ కుశలముగానే ఉన్నాము." అని అన్నాడు విశ్వామిత్రుడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహారాజా! మీరు మీ పరివారము ఈ రోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన, నీకును నీ పరివారమునకూ నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు." అని అడిగాడు.

“ఓ వసిష్ట మహర్షీ! మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిధి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక మేము వెళ్లి వస్తాము." అని అన్నాడు విశ్వామిత్రుడు.

కాని వసిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేసాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వసిష్ఠుడు తన వద్దఉన్న కామధేనువును పిలిచాడు.

“ఓ కామధేనువా! ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చారు. వారికి మనము అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రక రకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్ధములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికీ ఎట్టి లోపము రానీయవద్దు." అని పలికాడు వసిష్ఠుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)