శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 49)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభై తొమ్మిదవ సర్గ
ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇందుని వృషణములు కిందపడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని, మొదలగు దేవతలతోనూ, ఋషులతోనూ ఇలా అన్నాడు.“నేను మీ కోసం ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేసాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేసాను. తద్వారా దేవ కార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీ కోసం ఇదంతా చేసాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి.” అని అన్నాడు దేవేంద్రుడు.
దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు.
“ఓ పితృ దేవతలారా! మానవుడు యజ్ఞములు చేయునపుడు మేషములను(మేకలు, గొర్రెలు) బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి.” అని అన్నాడు.
అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణము లను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి, అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు.
రామా! మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాపవిమోచన కలిగిద్దాము." అని అన్నాడు విశ్వామిత్రుడు.
తరువాత విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటి దాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికి కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతం అయింది. ఆమె అందరికి కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు.
అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామ లక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిధి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేసారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు.
ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందుకున్నాడు.
గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్లిపోయాడు. రాముడు, లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment