శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 66)
శ్రీమద్రామాయణము
బాలకాండ
అరవై ఆరవ సర్గ
మరునాడు ఉదయం జనకమహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని, రామ లక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు. విశ్వామితునికి పూజలు చేసాడు.“ఓ విశ్వామిత్ర మహర్షీ! రామలక్ష్మణులారా! మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను." అని పలికాడు జనకుడు.
"ఓ జనకమహారాజా! నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు."అని అన్నాడు.
అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి, పరమశివుడు ఆ ధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవ వాడైన దేవ రాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనుస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది.
తరువాత నేను ఒక సారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ (మానవ యోని నుండి జన్మించనిది).
సీతకు యుక్తవయసువచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడే వాడు అత్యంత పరాక్రమ వంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను “వీర్యశుల్క" గా ప్రకటించాను. (అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి).
సీతను వివాహ మాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కు పెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేక
పోయారు. అందుకని నేను ఎవరికీ సీతను వివాహము చేయలేదు.
ఓ మహర్షీ! నేను నా కుమార్తె సీతను వీర్య శుల్వగా ప్రకటించి, వారికి అలవి కాని పరీక్ష పెట్టి, సీతను ఇచ్చి వివాహము చేయలేదని, ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు
యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను.
యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను.
ఆ విధంగా ఒక సంవత్సరము గడిచింది. మిథిలానగరములో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారము కోసరము అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సుచేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు పారిపోయారు.
ఓ విశ్వామిత్ర మహర్షీ! ఇదీ ఈ ధనుస్సు వృత్తాంతము. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే అన్న మాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపిస్తాను." అని అన్నాడు జనకుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment