శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 51)

శ్రీమద్రామాయణము

బాలకాండ

యాభై ఒకటవ సర్గ

జనకుని పక్కను ఉన్న శతానందుడు విశ్వామితుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు.
" ఓ మహర్షీ! శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా! నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా! మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా! దైవము ప్రతికూలించడం వలన మా తల్లి గారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా! రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా! మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరిం చాడా! నా తండ్రి అయిన గౌతముడు శ్రీ రాముని పూజించాడా! అతిధి సత్కారములు చేసాడా! శ్రీ రాముడు నా తండ్రిని ఆదరించాడా! గౌరవించాడా! మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా!" అని శతానందుడు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు.

ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. “ఓ శతానందా! నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేసాను. రేణుకా దేవి జమదగ్నిని చేరి నట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది." అని విశ్వామిత్రుడు
శతానందునితో అన్నాడు.

ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు. "శ్రీ రామా! సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యము చే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను.

ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు. చక్రవర్తి. ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసాడు. వీరి వంశము గురించి చెబుతాను విను.
ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసాడు. అందరు రాజులను ఓడించాడు.

ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు. ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వసిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫల వృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవ ఋషులు, దేవతలు, బ్రహ్మ ఋషులు వసిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్య ద్వేషములు, కోప తాపములు అసూయ లేవు. వాలఖిల్యులూ, వైఖానసులు, ఋషులు జపములు, హెూమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంత మంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంత మందికేవలము నీరు తాగుతూ మరి కొంత మంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. 

ఆ ఆశ్రమములో ఎటుచూచినా పవిత్రత ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉండేది. అటువంటి ప్రశాంత వాతావరణము లో ఉన్న వసిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)