శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 56)

శ్రీమద్రామాయణము

బాలకాండ

యాభై ఆరవ సర్గ

వసిష్ఠుడు రెండవ యమ దండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మ దండము పట్టుకొని “ఓరి దుష్టుడా! నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువ లేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను" అని విశ్వామితుని ఎదురుగా నిలబడ్డాడు.

విశ్వామిత్రుడు వసిష్ఠుని లెక్క చెయ్యలేదు. వసిష్ఠునిమీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వసిష్టుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగి పోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశు పతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణ పాశము, పైనాక, దైత అస్త్రములు, శుష్కము, ఆర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మ చక్రము, కాల చక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, తిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వసిష్ఠుని మీద ప్రయోగించాడు.

విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములను అన్నింటినీ వసిస్థుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంక విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వసిష్ఠుని మీద ప్రయో గించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములు అన్నీ ఆ బ్రహ్మ అస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి.

దేవతలు, గంధర్వులు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వసిష్టుని బ్రహ్మ దండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునుకూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వసిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వసిష్ఠుని దేహం నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వసిష్ఠుని చేతిలోని బ్రహ్మ దండము యమ దండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వసిష్ఠుని ఇలా ప్రార్థించారు.

" ఓ మహర్షీ! నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి" అని ప్రార్థించారు.
దేవతల ప్రార్థనను మన్నించ వసిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వసిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది.

ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పది అని తెలుసుకొన్నాడు.

"ఆహా! ఏమి ఆశ్చర్యము. వసిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్రశస్త్రములు అన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మ దండము నా అస్త్రములను అన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మ తేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును ఇంద్రియము లను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను" అని అనుకొన్నాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)