శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 58)
శ్రీమద్రామాయణము
బాలకాండ
యాభై ఎనిమిదవ సర్గ
త్రిశంకు ఆ మాటలు అంటున్నంత సేపూ వసిష్ఠుని కుమారులు కోపంతో ఊగి పోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది."ఓ త్రిశంకూ! నీవు దుర్బుద్ధివి. చెడ్డవాడివి. నీ కుల గురువు వసిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ల గలవు? నీకే కాదు, వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు. గురువు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమి స్తున్నావు? మా తండ్రిగారు, నీ కులగురువు అయిన వసిష్ఠుడు తన వల్లకాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు?
నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేక పోతున్నావు. వసిష్ఠుడు మూడు లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగము నైనా చేయించగల సమర్ధులు. అటువంటి వసిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి, వెంటనే నీవు తిరిగినీ నగరమునకు వెళ్లు. ఈ దుష్ట ఆలోచన
మానుకో." అని కోపంతో పలికారు వసిష్ఠుని కుమారులు.
ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. “ముని కుమారులారా! మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను మీరూ నిరాకరించారు. ఏం చేస్తాను. వేరేవాళ్లదగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవు ఇప్పించండి." అని అన్నాడు త్రిశంకు.
తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూచి వసిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు.
“ఓ త్రిశంకూ! నీవు క్షత్రియుడుగా ఉండ తగవు. నీవు ఛండాలుడివిగా మారిపో" అని శపించారు.
ఆ మునికుమారుల శాపము ప్రకారము ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకు ఛండాలుడిగా మారి పోయాడు.
నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు.
అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు.
త్రిశంకు ఒంటరి వాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామితుడు జాలి పడ్డాడు.
“నీవు త్రిశంకు మహారాజువు కదూ! ఇక్ష్వాకు వంశ రాజువు కదూ. నీవు నీ కులగురువు వసిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు. అతని కుమారులచేత శపించబడ్డావు. నీకు ఏం భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏంకావాలో అడుగు." అని పలికాడు విశ్వామిత్రుడు.
అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓమహర్షీ! నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్లవలెనని కోరిక. దాని కొరకు నూరు యజ్ఞములు చేసాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వసిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను ఛండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి.
ఓ మహర్షీ! నా గురించి మీకు తెలుసు కదా! నేను అసత్యమాడను. ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేసాను. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు. కాని నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనపుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా! దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశయించాను. ఇంక మీ దయ. మీరు కాదంటే నాకు వేరు గతి లేదు." అని ప్రార్థించాడు త్రిశంకు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment