శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 55)
శ్రీమద్రామాయణము
బాలకాండ
యాభై ఐదవ సర్గ
కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వసిష్ఠుడు. “ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు.” అని ఆదేశిం చాడు వసిష్ఠుడు.మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోనినుండి యవనులు, గోమయమునుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసారు.
తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వసిష్ఠుని మీదికి దుమికారు. వసిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా సేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయూయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామితుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉ న్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేసాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ రాజా! నీవు ఎందుకు ఇంతఘోర తపస్సు చేస్తున్నావు. నీకు ఏమి కావాలి. కోరుకో!"
అడిగాడు.
“ఓ మహాదేవా! తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను, సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉ పదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి" అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుని కోరికకు నవ్వి “నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను." అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్థానము అయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేసాడు. అహం కారంతో అట్టహాసం చేసాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్నిచనిపోగా మరి కొన్నిపారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. "భయపడకండి. నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను. మిమ్ములను రక్షిస్తాను." అని వసిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వసిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది.
విశ్వామిత్రుడు చేసిన మారణ కాండ చూచి వసిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామితా! నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవ జాలమును, వృద్ధిచేసిన ఆశ్రమమును క్షణ కాలంలో నాశనం చేసావు. నీకు భవిష్యత్తులేదు. నిన్ను నాశనం చేస్తాను.” అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment