శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 72)

శ్రీమద్రామాయణము

బాలకాండ

డెబ్బది రెండవ సర్గ

జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలాఅన్నారు.
“ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్ఠమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది.

ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటాయి." అని పలికారు.

ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు. “ ఓ మునిశ్రేష్ఠులారా! మీ సంబంధములతో నేను నా తమ్ముడు ధన్యులమయ్యాము. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు అయిన మాండవి, శ్రుతకీర్తి లను దశరథుని కుమారులు భరతుడు శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము చేయుటకు నేను నాతమ్ముడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. ఈ నాలుగు వివాహములు ఒకే రోజున ఒకే సమయములో ఒకే వివాహ వేదిక మీద జరిపిస్తాను.

ఉత్తర ఫల్గునీ నక్షత్రమునకు సంతాన ప్రదాత అయిన భగుడు దేవత. ఆ శుభనక్షత్రములో ఈ నాలుగు వివాహములు వైభవంగా జరిపించడానికి అనుమతి ఇవ్వండి. మీరు ఇరువురు దగ్గర ఉండి ఈ శుభకార్యములను జరిపించండి. ఈ వివాహములతో అయోధ్య, విదేహ రాజ్యములు ఒకటవుతాయి." అని వినయంతో పలికాడు జనకుడు.

ఆమాటలు విన్న దశరథుడు ఇలాఅన్నాడు. “ఓ జనక మహారాజా! నీవు, నీ సోదరుడు కుశధ్వజుడు సద్గుణ సంపన్నులు. ధర్మపరులు. మీతో సంబంధము నాకు ఎంతో ఆనంద దాయకము. నేను ఇంక మా నివాసమునకు వెళ్ళెదను. నా కుమారుల చేత వివాహమునకు ముందు జరుగు శ్రాద్ధకర్మలను, దానములను నిర్వర్తింప జేస్తాను." అని పలికాడు.

తరువాత వసిష్ఠుడు విశ్వామిత్రులతో కూడా తన నివాసమునకు వెళ్లాడు. ఆరోజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను నిర్వర్తింపజేసాడు. మరునాడు స్నాతక వ్రతమును జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత లక్ష గోవులను బ్రాహ్మణులకు దానము ఇప్పించాడు. ఆ విధంగా దశరథుడు తన కుమారులచేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే పాడి ఆవులు నాలుగులక్షల ఆవులను ఇంకా ఇతర ద్రవ్యములను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు.

(ఈ సర్గలో పెళ్లికి ముందు శ్రాద్ధ కర్మలు జరిపించారు అని ఉంది. మనం ఈ రోజుల్లో పెళ్లిళ్లు ముందు పెద్దలకు పెట్టుకుంటాము అని అంటారు కదా. శ్రాద్ధ కర్మలు అంటే శుభకార్యము జరిపించే ముందు పెద్దలను పూజించడం అని అర్థం చేసుకోవచ్చు.)

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)