శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 68)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై ఎనిమిదవ సర్గ

జనకమహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి మూడుదినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వార పాలకులకు “మిథిలా నగరము నుండి జనకమహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి." అని వర్తమానము పంపారు.

ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథమహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు.

“దశరథ మహారాజా! తమరికి జయము కలుగు గాక! మేము మిథిలాధిపతి అయిన జనకమహారాజు వద్దనుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరియొక్క, తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించుచున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిధి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. 

విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు, వారి మాటలుగా చెప్పమన్నారు.
“నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కాని నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను, విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు, రాముడు, తన వీరత్వముతో గెల్చుకున్నాడు. తర తరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసినదిగా కోరుచున్నాను. తమరుమిథిలకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.” అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది, తమ పురోహితులు శతానందులవారి అనుమతి పొంది తమరితో పైవిధముగా చెప్పమన్నారు." అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవిచేసారు.

తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వసిష్ఠుని, పురోహితులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. 
“రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహ పురములో ఉన్నాడని వర్తమానము వచ్చింది. మన రాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరకూ ఇష్టం అయితే. జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే, మనము విదేహ పురమునకు బయలుదేరి వెళుదాము." అని అన్నాడు.

దశరథుని ఆస్థానములో ఉన్న పురోహితులు, ఋషులు తమలో తాము తర్కించుకొని అందరూ ఏక కంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. “రేపే ప్రయాణము" అని నిర్ణయించాడు.

జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథమహారాజు అతిధులుగా అయోధ్యలో ఉన్నారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)