శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బదియవ సర్గ (Ramayanam - Balakanda - Part 70)
శ్రీమద్రామాయణము
బాలకాండ
డెబ్బదియవ సర్గ
మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు.“శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి." అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకుని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు.
వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు.
సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు. దశరథునితో ఇలా అన్నాడు.
“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.
“దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడు.
సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు, ఋషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు.
“ఓ జనక మహారాజా! మా కులగురువు, వసిష్ఠుడు అని మీకు తెలియును కదా! బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వసిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వ రాజుల గురించి వివరంగా చెప్పగలడు." అని పలికి దశరథుడు వసిష్ఠునని వంక చూచాడు.
దశరథుని మాటలు విన్న వసిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను, జనకుని, సదానందుని చూచి ఇలా అన్నాడు.
"ఓ జనకమహారాజా! సభాసదులారా! ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే వంశము ఆవిర్భవించింది.
ఇక్ష్వాకుని కుమారుడు కుక్ష్మి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు.
భరతుని కుమారుడు అసితుడు, హైహయ రాజులైన హైహయుడు, తాలజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శతృత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.
ఆ సమయములో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశ్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది.
చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి "ఓ భాగ్యశాలీ! నీ గర్భములో మహా బలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహా వీరుడు. తేజశ్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు." అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజశ్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.
ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకొని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుష్ఠుడు. కకుబ్ధుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది.
రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాప వశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరుకూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు
అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుక్రుడు. ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు.
ఈ దశరథమహారాజు పుత్రులే రామలక్ష్మణులు.
ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా! వీరు మొదటి నుండీ విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన వారు. వీరులు. సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బదియవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment