శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 61)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై ఒకటవ సర్గ

ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు.

ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు.

అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి పాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది." అని అన్నాడు పురోహితుడు.

అంబరీషుడు వేల కొలదీ ఆవులు ఇస్తాను ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేక పోయింది. ఆ సమయంలో ఋచీకుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.

అంబరీషుడు ఆ ఋచీకమహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. “ ఓ మహర్షీ! నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా!" అని అడిగాడు.
“లేదు. నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా!" అని అన్నాడు.

ఋచీకుని భార్య ఇలా అంది. “నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను.” అని చెప్పింది.

ఋచీకునకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు.

“ఓ అంబరీషా! పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటంలేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్లండి.” అని అన్నాడు.

అంబరీషుడు సంతోషంగా ఋచీకునకు లక్షగోవులు మూల్యంగా చెల్లించి శునశేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకొని వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)