శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 53)
శ్రీమద్రామాయణము
బాలకాండ
యాభై మూడవ సర్గ
వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు.అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి." అని అడిగాడు.
ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను. " అని చెప్పాడు వసిష్ఠుడు.
“అది కాదు మహర్షీ! ఒక్క ఆవులే కాదు. బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వమఱులను కట్టిన 8 బంగారు రధములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు నీకు కోటి పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే, అదీకాకపోతే నీకు ఏం కావాలో కోరుకో .... అవి అన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాతం నాకు ఇవ్వు.” అని అడిగాడు విశ్వామితుడు.
“నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము. నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు. నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత, ఎట్టి పరిస్థితులలోనూ నేను నా
కామధేనువును నీకు ఇవ్వలేను..... ఇవ్వను” అని చెప్పాడు వసిష్ఠుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment