శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 62)
శ్రీమద్రామాయణము
బాలకాండ
అరవై రెండవ సర్గ
ఋచీకుని వద్దనుండి అతని కుమారుడైన శునశేపుని లక్షగోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు, అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఈ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు.
“ఓ మహర్షీ! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. ఇద్దరూ నన్ను వదిలేసారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రివంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి. " అని వేడుకున్నాడు.
శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. “కుమారులారా! తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేసారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్లడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు శునశేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను శునశేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది." అని అన్నాడు.
తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. "తండ్రీ! మీరు శునశేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్లమం టున్నారు. అలా చెయ్యడం కుక్కమాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరమూ వెళ్లము." అని చెప్పారు.
కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. “ఏమన్నారు. పరులకు సాయం చెయ్యడం కుక్కమాంసం తినడంతో సమానమా! అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్కమాంసము తింటూ వేయి సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము." అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు.
ఇదంతా చూచిన శున శేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు.
“ఓ శునశేపా! యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎరని పుష్పమాలలు వేసి, ఊపస్తంభమునకు కడతారు. అపుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది." అని అన్నాడు విశ్వామిత్రుడు.
శునశేపునకు రెండు మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన శునశేపుడు అంబరీషుని వెంట వెళ్లాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. శునశేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేసారు. ఊపస్థంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేసారు.
అప్పుడు శునశేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. శునశేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా శునశేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి.
తరువాత విశ్వామిత్రుడు వేయి సంవత్సరములు పుష్కరక్షేత్రములో తపస్సు చేసాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment