శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 67)
శ్రీమద్రామాయణము
బాలకాండ
అరవై ఏడవ సర్గ
జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. “ఓ జనక మహారాజా! నీవు చెప్పినది అంతా విన్నాము. నీవద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు." అని అన్నాడు.జనకుడు పూజా మందిరములో పూజలందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞాను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రముల గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివ ధనుస్సును తీసుకొని వచ్చారు. 5,000 మంది ధృడకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకొని వచ్చారు.
"జనక మహారాజా! తమరు ఆదేశించినట్టు, నీవు రామునికి చూపదలచుకొన్న శివధనుస్సును తీసుకొని వచ్చాము." అని అన్నారు సామంత రాజులు.
జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు, రాజకుమారులు
ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గానీ, ఎక్కుబెట్టుటకు కానీ మానవ మాత్రులకు సాధ్యము కాదుకదా! ఓ విశ్వామిత్ర మహర్షీ! దీనిని రామలక్ష్మణులకు చూపుము."అని అన్నాడు జనకుడు.
విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. “రామా! ఈ ధనుస్సును చూడు." అన్నాడు.
విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు “అలాగే మహాత్మా! తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను, తాకుతాను, ఆ ధనుస్సును ఎత్తడానికి, నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను." అని అన్నాడు.
అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏ మాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు ఒంగింది. ఫెడేల్ మని మధ్యకు విరిగిపోయింది. రెండు ముక్కలు అయింది.
ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకర మైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు.
తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కలా నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత, దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను “వీర్యశుల్క” గా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను.
ఓ విశ్వామిత్ర మహర్షీ! తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి, రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉ న్నారని తెలిపి, రాముడు శివధనుర్భంగము చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథమహారాజుకు వివరంగా చెప్పి, దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతము గా మిధిలకు తోడ్కొని రాగలరు. " అని వినయంగా పలికాడు.
అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్లి దశరధమహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని వచ్చుటకు మంత్రులను
పంపించాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment