శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 54)
శ్రీమద్రామాయణము
బాలకాండ
యాభై నాల్గవ సర్గ
ఈ ప్రకారంగా వసిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామ ధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు.ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడిచింది. తనలో తాను ఇలా అనుకొంది. “ఇదేమిటి. ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వసిష్ఠుని వద్ద ఉన్నాను కదా. వసిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా! లేక పోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు. ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేసాను. ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేసాను కదా. ఈ రోజుకూడా వసిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా! మరి ఎందుకు నన్ను వదిలివేసాడు. ఆయననే అడుగుతాను." అని తనలో తాను అనుకుంది.
వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వసిష్ఠుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ వసిష్ఠునితో ఇలా పలికింది. "ఓ బ్రహ్మర్షీ! దుర్మార్గులైన రాజ భటులు నన్ను నీ వద్దనుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేసావా. నేను ఏం అపరాధము చేసానని నన్ను వాళ్లకి ఇచ్చావు." అని అడిగింది కామధేనువు.
ఆ మాటలు విన్న వసిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దు:ఖించాడు. ఆ కామధేనువుతో వసిష్ఠుడు ఇలాఅన్నాడు. “ఓ కామధేనువా! నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చెయ్యలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్దనుండి తీసుకొని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడ గలడు. అతడు ఈ ప్రాంతమునకు రాజు. పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నా కంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను. నిన్ను ఎలా రక్షించుకోను. " అని అన్నాడు వసిష్ఠుడు.
“ఓ బ్రహ్మర్షీ! విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మ బలమునకు అది సాటి రాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షీ! నీ బ్రహ్మ బలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను." అని పలికింది కామధేనువు.
వెంటనే వసిష్ఠుడు పైకి లేచాడు. “ఓ కామధేనువూ! నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు." అని ఆజ్ఞాపించాడు.
మహాఋషి ఆజ్ఞమేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలమీద పడి వారిని ఓడించాయి. తరిమికొట్టాయి.
తన కళ్లఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేసాడు.
ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేసాడు.
ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసాయి. అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదరు చేసాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment