శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 71)

శ్రీమద్రామాయణము

బాలకాండ

డెబ్బది ఒకటవ సర్గ

ఆ ప్రకారంగా వసిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత, జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు.
"ఓ దశరథ మహారాజా! తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి.

మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిథి అనే చక్రవర్తి. మిది, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్ట మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్థనుడు. నంది వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి.

రాజర్షిఅయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు
దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రకుడు. మహీధ్ధకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి.

రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హస్వరోముడు. ఆ హస్వరోమునికి ఇరువురు కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవ వాడు నా తమ్ముడు కుశధ్వజుడు.

మా తండ్రిగారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేసాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్లాడు. కాలవశాత్తు నా తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణభారము వహించి రాజ్యము చేస్తున్నాను.

కొంత కాలము తరువాత సాంకాశ మహారాజు సుధన్వుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును, నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానము పంపాడు. నేను నా కుమార్తెను గానీ శివధనుస్సును గానీ సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది. నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాశ పురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశ పురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేసాను.

ఓ వసిష్ట మునీంద్రా! మా సోదరులలో నేను పెద్ద వాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏ మాత్రము సందేహమునకు తావు లేకుండా మూడు మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళ లను దశరథమహారాజు కుమారులైన రామునికి లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను.

ఓ దశరథ మహారాజా! రామ లక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి. పితృకార్యము జరిపించిన తదుపరి వివాహమహోత్సవమును జరిపించెదను.

ఓ దశరథ మహారాజా! నేడు మఘా నక్షత్రము. నేటికి మూడవ రోజున అనగా ఉత్తరఫల్గునీ నక్షత్రములో వివాహము జరిపించెదము. ఈ రెండు రోజులలో రామ లక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రములు నిర్వర్తింపుడు." అని వినయంతో పలికాడు జనకుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)