శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 57)

శ్రీమద్రామాయణము

బాలకాండ

యాభై ఏడవ సర్గ

"ఓ రామా! వసిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత, ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ, ఘోరమైన తపస్సుచేసాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధృడనేతుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు. అప్పటికి వేయి సంవత్సరములు గడిచాయి.

విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ విశ్వామిత్రా! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేసావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు." అని పలికాడు.

తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంత కాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా. నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు. బ్రహ్మర్షి అని పిలువబడేవరకు తపస్సు చేస్తాను. అని నిర్ణయించుకున్నాడు. 

మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు. ఆవిధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనికి ఈ శరీరంతోపాటు స్వర్గానికి వెళ్లాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వసిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు.

త్రిశంకు వసిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వసిష్ఠుడు ఆ పని తన వల్లకాదు అని చెప్పాడు.

“నీ వల్ల కాక పోతే నీ కుమారులతో చేయిస్తాను" అని పలికి తిశంకుడు వసిష్ఠుని కుమారుల వద్దకు వెళ్లాడు. వసిష్ఠుని నూర్గురు కుమారులు తమతమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్లాడు త్రిశంకు. 

వాళ్లముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. "ఓ ముని కుమారులారా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వసిష్ఠులవారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందు వలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞము చేయించుటకు మీరే సమర్థులు.

వసిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నపుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవసమానులు కదా!. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి" అని వేడుకున్నాడు త్రిశంకు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో యాభై ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)