శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 75)
శ్రీమద్రామాయణము
బాలకాండ
డెబ్బది ఐదవ సర్గ
వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు.“ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! " అని రాముని పిలిచాడు పరశురాముడు.
ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు. "ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ఏమీ చేయనని అభయము ఇమ్ము.
ఓ పరశురామా! నీవు సామాన్యుడవుకావు. పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు. దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు. నీవు జయించిన ఈ భూమండలము నంతా కశ్యపునకు దానం చేసావు. మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నావు. అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు. రాముడు నీతో యుద్ధము
చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము ఎవరమూ బతుకలేము. కాబట్టి మా కందరకూ ప్రాణభిక్ష పెట్టు." అని వేడుకున్నాడు.
కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్కచేయలేదు. రాముని చూచి ఇలా అన్నాడు.
"ఓ రామా! నీవు విరిచిన ధనుస్సు, నా చేతిలో ఉన్న ధనుస్సు రెండూ గొప్పవి. దివ్యలోకములకు సంబంధించినవి. బాగా ధృడమైనవి. బలమైనవి. ఈ రెండు ధనుస్సులను విశ్వకర్మ తయారు చేసాడు. అందులో ఒక ధనుస్సును త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు. ఆ ధనుస్సునే నీవు విరిచావు. ఈ రెండవ ధనుస్సు దేవతలు విష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణు ధనుస్సు అని అంటారు. ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది.
ఒక సారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు, విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు? అని అడిగారు. బ్రహ్మ కూడా చెప్పలేకపోయూడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు. అవి వారిద్దరి మధ్య యుద్ధమునకు దారి తీసాయి. శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారము చేసాడు. ఆ హుంకారమునకు శివుడు భయపడి పోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.
పరమశివునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న శివ ధనుస్సును విదేహ దేశాధీశుడు అయిన దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనుస్సును భృగు వంశీకుడు అయిన ఋచీకుని వద్ద ఉంచాడు. ఋచీకుడు మా తాతగారు. మా తాత గారైన ఋచీకుడు ఆ విష్ణు ధనుస్సును తన కుమారుడు. మా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు.
పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్ని ని చంపాడు. నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను. అతనినే కాదు క్షత్రియ వంశములో ఉన్న ప్రతి వానినీ పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను. క్షత్రియకులమును సర్వనాశనము చేసాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేసాను. క్షత్రియులను చంపి నేను జయించిన ఈ భూమిని కశ్యపునకు దానంగా ఇచ్చాను. తరువాత నేను మహేంద్రపర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. ఇప్పుడు నీవు శివధనుస్సును విరిచావు అని దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను.
ఓ రామా! నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మము ప్రకారము మాకు వంశపారంపర్యముగా సంక్రమించిన ఈ విష్ణుధనుస్సును తీసుకో. దీనిని కూడా ఎక్కుపెట్టి సంధించు. నాతో ద్వంద్వ యుద్ధము చెయ్యి. " అని పలికాడు పరశురాముడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment