శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 65)

శ్రీమద్రామాయణము

బాలకాండ

అరవై ఐదవ సర్గ

ఆ ప్రకారంగా నిర్ణయించుకొన్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచి పెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్లాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకొని వేయి సంవత్సరములు ఘోరమైన తపస్సుచేసాడు.
విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కాని విశ్వామిత్రుడు చలించలేదు. ఇంద్రియములకు లోబడలేదు. వేయి సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంక తపస్సు పూర్తి అయింది అనుకొని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను. అన్నం పెట్టమని యాచించాడు. మారు మాటాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషములో ఉన్న ఇంద్రుని ఒక్కమాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోప పడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు.

మరలా తపస్సుకు పూనుకొన్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి ఆ మంటలు
లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు.

“ ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము. ఆమెను రాయిని చేసాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము. కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరంనుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు. గాలి వీచడం లేదు. భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి.” అని వేడుకున్నారు.

దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
" ఓ బ్రహ్మర్షీ! నీవు బ్రాహ్మణత్వమును పొందావు. బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు. నీకు శుభం కలుగుతుంది." అని వరాలు ఇచ్చాడు బ్రహ్మ.

విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. "ఓ బ్రహ్మదేవా! మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగును గాక! వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించును గాక! యజ్ఞములు యాగములు చేయించు అధికారము నాకు కలుగు గాక! బ్రహ్మర్షిఅయిన వసిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీరించును గాక! ఇవి కూడా నాకు ప్రసాదించండి." అని అడిగాడు.

బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలు అందరూ వసిష్ఠుని వద్దకు వెళ్లారు. “ఓ వసిష్ట మహర్షీ! విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని “బ్రహ్మర్షి" అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని "బ్రహ్మర్షి” అని అంగీకరించండి." అని ప్రార్థించారు.

ఆ మాటలకు వసిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షివి. నేను అంగీకరిస్తున్నాను." అని అన్నాడు.

వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములు అన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెళుతున్నాము.” అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు.

వెంటనే విశ్వామిత్రుడు లేచి వసిష్ఠునిసాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించాడు.

ఓ రామా! విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు. ధర్మాత్ముడు. వీరుడు." అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామితుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించాడు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతమును విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేసాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షీ! ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహాదానందముగా ఉంది. తమరి దర్శనభాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందులవారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను. నీ గుణగణములను మేము అందరమూ విని తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము. పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సుచెయ్యడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషము లను ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు. కాని ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యములు నిర్వర్తించవలెను కదా! కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయము తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకొని వెళతాను." అని వినయంగా పలికాడు జనకమహారాజు.

ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చాడు.
జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసాడు. తరువాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు వెళ్లాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో అరవై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)