శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 74)

శ్రీమద్రామాయణము

బాలకాండ

డెబ్బది నాల్గవ సర్గ

సీతారాముల కల్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు, నూతన వధూవరు లందరినీ ఆశీర్వదించి, జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్లిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు.

అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. లక్ష ఆవులను, అనేక వస్త్రాభరణములను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణ గా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. తరువాత వెను తిరిగి మిథిలకు వచ్చాడు.

దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వసిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునముల కు అర్థం చెప్పమని అడిగాడు. 

అప్పుడు వసిష్ఠుడు ఇలా అన్నాడు. "ఓ దశరథమహారాజా! మనకు ఏదో ఒక ఆపద వచ్చి
పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగా తొలగి పోతుంది అని కొన్ని శుభశకునములు కూడా కనపడుతున్నాయియి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు.” అని వివరించాడు వసిష్ఠుడు.

ఇంతలో తీవ్రంగా పెను గాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెల వెల బోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు. 

అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు. వెంటనే దశరథుడు, వసిష్ఠుడు, బాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు. ఉచితాసనము ఇచ్చి సత్కరిం చారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో డెబ్బది నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)